Job Skills: ఏఐ తరంలోనూ ఇదే నెంబర్‌ 1 స్కిల్‌.. జాబ్‌లో చేరబోయేవారికి మిలియనీర్‌ సూచన

Job Skills: ఉద్యోగంలో చేరబోయేవారికి ఉండాల్సిన ఓ కీలక స్కిల్‌ను న్యూయార్క్‌లోని ఓ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ స్కాట్‌ గాల్లోవే వెల్లడించారు. అది ఎప్పటికీ కాలం చెల్లని నైపుణ్యమని వివరించారు. అదేంటో చూద్దాం..

Updated : 15 Apr 2024 10:57 IST

వాషింగ్టన్‌: కృత్రిమ మేధ (Artificial Intelligence- AI), మెషీన్‌ లెర్నింగ్‌, కోడింగ్‌.. ఇవే ఇప్పుడు జాబ్‌ మార్కెట్‌లో హాట్‌ టాపిక్‌. వీటిలో నైపుణ్యం ఉన్నవారికి మంచి డిమాండ్‌ ఉంది. అయితే వీటి కంటే ముందు ఈ ఏఐ జనరేషన్‌లోనూ మరో స్కిల్‌ చాలా ప్రధానమని చెబుతున్నారు అమెరికాకు చెందిన పారిశ్రామికవేత్త. అదే స్టోరీ టెల్లింగ్. 

న్యూయార్క్‌లోని ఓ యూనివర్సిటీలో మార్కెటింగ్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న స్కాట్‌ గాల్లోవే ఓ కంపెనీని స్థాపించి దాన్ని 130 మిలియన్‌ డాలర్లకు విక్రయించారు. ఉద్యోగ జీవితంలోకి ప్రవేశించే వారికి స్టోరీ టెల్లింగ్‌ నైపుణ్యం చాలా కీలకమని తన అనుభవంలో తెలుసుకున్నట్లు చెప్పారు. పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడుతున్న ఈ రోజుల్లోనూ మనం అనుకున్నది అత్యంత ప్రభావవంతంగా చెప్పడం కీలకమని వివరించారు. తగిన సమాచారం, చిత్రాలు, ఇన్ఫోగ్రాఫిక్స్‌తో మన ఆలోచనలను వ్యక్తపర్చడం అవసరమన్నారు. కమ్యూనికేషన్‌ మాధ్యమాలు మారొచ్చేమో కానీ, చెప్పే విధానానికి మాత్రం ప్రాధాన్యం తగ్గదన్నారు. ఇది ఎప్పటికీ కాలం చెల్లని నైపుణ్యమని వివరించారు. 

పూర్తిగా చాట్‌జీపీటీ (ChatGPT) వంటి ఏఐ టూల్స్‌పై ఆధారపడటం ప్రయోజనకరం కాదని స్కాట్‌ హెచ్చరించారు. ఏఐ, కోడింగ్‌ అత్యవసరమైనప్పటికీ.. స్టోరీ టెల్లింగ్‌ అత్యంత విలువైన నైపుణ్యమని వివరించారు. ఒక బ్రాండ్‌ ప్రతిష్ఠను పెంచడం, తగ్గించడం దీనిపైనే ఆధారపడి ఉంటుందన్నారు. వచ్చే ఐదేళ్లలో చాట్‌జీపీటీ (ChatGPT) వంటి అత్యాధునిక టెక్నాలజీలు సైతం కనుమరుగయ్యే అవకాశం లేకపోలేదని తెలిపారు. న్యూరల్‌ నెట్‌వర్క్‌ వంటి టెక్నాలజీలు తెరపైకి రావొచ్చని అంచనా వేశారు. అప్పుడు కోడింగ్‌కు ప్రాధాన్యం ఉండదన్నారు. ఆ వేళ కూడా స్టోరీ టెల్లింగే కీలక నైపుణ్యం అవుతుందని అభిప్రాయపడ్డారు.

ఇదే సక్సెస్‌ సూత్రం..

ఎంచుకున్న రంగంలో నైపుణ్యం సాధించడమే సక్సెస్‌ సూత్రమని స్కాట్‌ వివరించారు. ఎన్ని టెక్నాలజీలు వచ్చినా.. చేసే పనిపై పట్టు సాధించడమే విజయానికి నమ్మకమైన దారి అని తెలిపారు. ‘‘ఒక రంగాన్ని ఎంచుకోండి. అది ఎంత చిన్నదైనా ఫర్వాలేదు. గట్టిగా ప్రయత్నించండి. దానిపై పట్టు సాధించండి. ఆ డొమైన్‌లో వీలైనంత ఎక్కువ జ్ఞానాన్ని సంపాదించండి. దేన్నైనా ఎంజాయ్‌ చేయాలి. లేదంటే నైపుణ్యం సాధించడం కష్టం’’ అని స్కాట్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని