TATA SONS Chairman: వచ్చే దశాబ్దం మనదే

వచ్చే దశాబ్దంలో అభివృద్ధి పరంగా మెరుపులీనడానికి మన దేశం సిద్ధంగా ఉందని టాటా సన్స్‌ ఛైర్మన్, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు.

Published : 24 May 2024 03:03 IST

టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌

దిల్లీ: వచ్చే దశాబ్దంలో అభివృద్ధి పరంగా మెరుపులీనడానికి మన దేశం సిద్ధంగా ఉందని టాటా సన్స్‌ ఛైర్మన్, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ లిమిటెడ్‌ (టీసీపీఎల్‌) ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. టీసీపీఎల్‌ వార్షిక నివేదిక విడుదల చేశాక, వాటాదార్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ అంతర్జాతీయ జీడీపీ స్తబ్దుగా ఉంది. కొవిడ్‌ పరిణామాల సవాళ్లు, భౌగోళిక-రాజకీయ ఉద్రికత్తలు ఇందుకు కారణం. ఇలాంటి అడ్డంకులున్నా, మన దేశం మాత్రం వృద్ధి చెందుతోంది. బలమైన ఫలితాలు, ఆరోగ్యకర బ్యాంకింగ్‌ వ్యవస్థ, అనుకూల కార్పొరేట్‌ పన్ను రేట్లు, అభివృద్ధి చెందుతున్న  మూలధన వ్యయాలు, బలమైన డిజిటల్‌ మౌలిక సదుపాయాల వంటివి వచ్చే దశాబ్దంలో భారత్‌ ముందంజ వేయడానికి దోహదం చేస్తాయి. కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంతో ఉత్పాదకత కూడా పెరుగుతోంది. దేశంలో నిరుద్యోగ రేటు కూడా పెరగలేదు. మనదేశంలో యువ జనాభా అధికంగా ఉండటం, మధ్య తరగతి సంఖ్య క్రమంగా పెరగడం, వేగవంతమైన పట్టణీకరణ, ప్రజల చేతిలో మిగులు ఆదాయం పెరగడం, ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షలు ఆర్థిక వ్యవస్థకు కలిసి వస్తాయ’ని చంద్రశేఖరన్‌ వివరించారు.

‘బులిష్‌ ధోరణి’లో టీసీపీఎల్‌: 2024-25లో టీసీపీఎల్‌ బులిష్‌ ధోరణి కనబరుస్తుందని చంద్రశేఖరన్‌ అంచనా వేశారు. వ్యూహాత్మక ప్రాధాన్యాలు అమలు చేయడం ద్వారా స్థిరమైన వృద్ధి సాధించి, వాటాదార్లకు మంచి విలువ అందించే లక్ష్యంతో పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. భవిష్యత్తులో విక్రయాలు, పంపిణీ నెట్‌వర్క్‌ను పెంచుకోవడంతో పాటు ఇ-కామర్స్, ఓమ్నీ-చానెల్‌ ఓరియెంటేషన్‌పై దృష్టి సారిస్తామన్నారు. కంపెనీ ప్రారంభించి నాలుగేళ్లే అయినా, పరిశ్రమలో ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నామని తెలిపారు.  2023-24లో టీసీపీఎల్‌ ఆదాయం 10 శాతం వృద్ధితో రూ.15,206 కోట్లకు చేరింది. 2020లో టాటా కెమికల్స్, టాటా గ్లోబల్‌ బెవరేజెస్‌లను విలీనం చేసి టీసీపీఎల్‌ను ఏర్పాటు చేశారు. టాటా సాల్ట్, టాటా టీ, టెట్లీ, ఎయిట్‌ ఓ’క్లాక్‌ కాఫీ, గుడ్‌ ఎర్త్‌ టీ, టాటా సంపన్న్‌ వంటి బ్రాండ్లను ఇది కలిగి ఉంది. టాటా స్టార్‌బక్స్‌ పేరిట కాఫీ చైన్‌ను కూడా నిర్వహిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని