Adani Group: బ్యాంకింగ్‌ రంగానికి ఢోకా లేదు.. ‘అదానీ’ వ్యవహారంపై నిర్మలమ్మ స్పందన

Adani Group: దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ, ఫైనాన్షియల్‌ మార్కెట్లు పటిష్ఠంగా ఉన్నాయని నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు. అదానీ షేర్ల పతనం ప్రభావం పెద్దగా ఉండదని పరోక్షంగా అభిప్రాయపడ్డారు..

Updated : 03 Feb 2023 19:05 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group) కంపెనీల షేర్ల పతనం కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీల్లో ఎల్‌ఐసీ (LIC), ఎస్‌బీఐకి  (SBI) భారీ ఎత్తున పెట్టుబడులు ఉన్నాయని.. నష్టాలకు బాధ్యులెవరంటూ వస్తున్న ఆరోపణలకు ఆమె ప్రధానంగా స్పందించారు. తమ మొత్తం పెట్టుబడుల్లో అదానీ కంపెనీల్లో ఉన్నవి చాలా తక్కువేనని ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ చేసిన వ్యాఖ్యల్ని ఆమె ప్రస్తావించారు. తమ పెట్టుబడులు అదానీ (Adani Group) కంపెనీల్లో అనుమతించిన పరిధిలోనే ఉన్నాయని చెప్పిన అంశాన్ని ఉటంకించారు. అదానీ షేర్ల వ్యవహారంపై ప్రభుత్వం తరఫున తొలి అధికారిక స్పందన ఇదే కావడం గమనార్హం. ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

దేశ బ్యాంకింగ్‌ వ్యవస్థ చాలా పటిష్ఠంగా ఉందని నిర్మలా సీతారామన్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ‘ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ బోర్డు’, ఆర్‌బీఐతో నిర్వహించిన సమీక్ష తర్వాత తాను ఈ విషయాన్ని చాలా బాధ్యతాయుతంగా చెప్పగలుగుతున్నానని స్పష్టం చేశారు. బ్యాంకుల నిరర్థక ఆస్తులు తగ్గుతున్నాయన్నారు. పరోక్షంగా అదానీ షేర్ల పతనం బ్యాంకింగ్‌ రంగంపై ఉండబోదని ఆమె ధీమాగా చెప్పారు.

విదేశీ మదుపర్లు గతంలో మాదిరిగానే నిశ్చింతగా భారత్‌లో పెట్టుబడులు కొనసాగించొచ్చని సీతారామన్‌ తెలిపారు. నియంత్రణ, నిబంధనల విషయంలో దేశీయ ఫైనాన్షియల్‌ మార్కెట్‌ చాలా పటిష్ఠంగా ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో ఒక్క ఉదంతాన్ని ఆధారంగా చేసుకొని భారత మార్కెట్లను అంచనా వేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా అదానీ గ్రూప్ షేర్ల పతనాన్ని ఆధారంగా చేసుకొని కలవరపడాల్సిన అవసరం లేదన్నారు. దశాబ్దాలుగా అనేక అంశాల నుంచి భారత మార్కెట్లు పాఠాలు నేర్చుకున్నాయని పేర్కొన్నారు. దేశీయ మార్కెట్లను పటిష్ఠంగా ఉంచడంలో నియంత్రణ సంస్థలు నిక్కచ్చిగా పనిచేస్తున్నాయని చెప్పారు. 

అదానీ గ్రూప్‌ రుణాలు, ఈక్విటీల్లో లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (LIC)కు రూ.36,474 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇవి తమ మొత్తం పెట్టుబడుల్లో 1 శాతం కంటే తక్కువేనని ఎల్‌ఐసీ సోమవారం వెల్లడించింది. మరోవైపు అదానీ గ్రూప్‌నకిచ్చిన రుణాలన్నీ.. నగదు వచ్చే ఆస్తుల ద్వారా పూర్తిగా హామీతో ఉన్నాయని ఎస్‌బీఐ ప్రకటించింది. ఈ బ్యాంకు 2.6 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.21,300 కోట్ల) రుణాలిచ్చినట్లు కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. అందులో 200 మిలియన్‌ డాలర్లను విదేశీ అనుబంధ సంస్థల ద్వారా ఇచ్చినట్లు తెలుస్తోంది. తమ బ్యాంకు అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాలేవీ ‘తక్షణం సవాలు’గా మారే సమస్యే లేదని ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖరా పేర్కొన్నారు.

టీ కప్పులో తుపాను..

స్థూల ఆర్థిక వ్యవస్థ కోణంలో చూస్తే ‘అదానీ’ షేర్ల పతనం వల్ల స్టాక్‌ మార్కెట్‌లో వచ్చిన గందరగోళం ‘టీ కప్పులో తుపాను’ లాంటిదని ఆర్థికశాఖ కార్యదర్శి టి.వి సోమనాథన్‌ శుక్రవారం అన్నారు. స్టాక్‌ మార్కెట్‌ కదలికలపై ప్రభుత్వానికి ఎలాంటి ఆందోళనా లేదని తెలిపారు. స్వతంత్ర నియంత్రణా సంస్థలు అవసరమైన చర్యల్ని తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. అదానీ గ్రూప్‌నకు రుణాలిచ్చిన బ్యాంకుల్లో డిపాజిట్లు ఉన్నవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అలాగే పెట్టుబడిన పెట్టిన ఇన్సూరెన్స్‌ కంపెనీల పాలసీదారులు సైతం నిశ్చింతగా ఉండొచ్చన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని