Anant Ambani: అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్ వేడుక.. నీతా అంబానీ స్పెషల్‌ మెసేజ్‌..

Anant Ambani-Radhika Merchant: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ తనయుడు అనంత్‌ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకల్లో పాల్గొనేందుకు వస్తోన్న ప్రముఖులతో జామ్‌నగర్‌ సందడిగా మారింది.

Updated : 01 Mar 2024 10:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత సంపన్నుడు, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధిపతి ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ (Anant Ambani), ఎన్‌కోర్‌ హెల్త్‌కేర్‌ సీఈఓ వీరేన్‌ మర్చంట్‌ కుమార్తె రాధిక (Radhika Merchant) ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రముఖుల రాకతో జామ్‌నగర్‌లో సందడి నెలకొంది. ఈ సందర్భంగా అతిథులను ఆహ్వానిస్తూ ముకేశ్ సతీమణి నీతా అంబానీ (Nita Ambani) ప్రత్యేక వీడియో సందేశమిచ్చారు.

‘‘మా చిన్న కుమారుడు అనంత్‌-రాధిక వివాహం విషయానికొస్తే నాకు రెండు ముఖ్యమైన కోరికలున్నాయి. మొదటిది.. మన మూలాలను గుర్తుంచుకునేలా వేడుకలు నిర్వహించాలని భావించాం. రెండోది.. ఈ వేడుక మన కళలు, సంస్కృతి, దేశ వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలని కోరుకున్నాం. ఇక, జామ్‌నగర్‌ మా హృదయాలకు ఎంతో దగ్గరైన ప్రాంతం. నా కెరీర్‌ను ఇక్కడే ప్రారంభించా’’ అని నీతా ఆ సందేశంలో పేర్కొన్నారు.

జామ్‌నగర్‌ చేరుకున్న జుకర్‌బర్గ్‌..

ప్రీ వెడ్డింగ్‌ (Pre Wedding) వేడుకల్లో పాల్గొనేందుకు సినీ తారలు, పలువురు ప్రముఖులు జామ్‌నగర్‌ చేరుకుంటున్నారు. వీరిని ఆహ్వానించేందుకు ఎయిర్‌పోర్టులోనూ స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ ఉదయం మెటా అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌, తన సతీమణి ప్రిసిల్లా చాన్‌తో కలిసి జామ్‌నగర్‌ చేరుకున్నారు. వారికి సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. ఇప్పటికే బాలీవుడ్‌ నుంచి రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె, రాణీ ముఖర్జీ, షారుక్‌ఖాన్‌ కుటుంబం, అర్జున్‌ కపూర్‌, ఆలియాభట్‌-రణబీర్‌ కపూర్‌ కుటుంబం, దర్శకుడు అట్లీ తదితరులు విచ్చేశారు. అటు పాప్‌ సింగర్‌ రిహన్నా కూడా జామ్‌నగర్‌ చేరుకున్నారు.

ఈ మధ్యాహ్నం వరకు అతిథులందరూ వేదిక వద్దకు చేరుకోనున్నారు. సాయంత్రం 5.30 గంటలకు ప్రీవెడ్డింగ్‌ వేడుకలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు సంప్రదాయబద్ధంగా, అట్టహాసంగా జరగనున్నాయి. అనంత్‌, రాధిక నిశ్చితార్థం 2023 జనవరిలో ముంబయిలోని అంబానీ నివాసం యాంటిలియాలో జరిగింది. జులైలో వీరిద్దరూ వివాహబంధంలోకి అడుగుపెట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని