OPS: పాత పెన్షన్‌ స్కీం పునరుద్ధరణపై నీతి ఆయోగ్‌ ఆందోళన!

కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే కొత్త పెన్షన్‌ పథకం నుంచి పాత పెన్షన్‌ విధానంలోకి మారాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే, ఇది భవిష్యత్తు ప్రభుత్వాలు, పౌరులపై భారం మోపుతుందని నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ ఆందోళన వ్యక్తం చేశారు. 

Published : 27 Nov 2022 18:53 IST

దిల్లీ: పాత పెన్షన్‌ పథకం (OPS) పునరుద్ధరణపై నీతి ఆయోగ్‌ వైస్‌ ఛైర్మన్‌ సుమన్‌ బేరీ ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల భవిష్యత్తు పన్ను చెల్లింపుదారులపై భారం పడుతుందని తెలిపారు. ఆర్థిక పరిపుష్టి, సుస్థిర వృద్ధిరేటును సాధించాల్సిన ఈ తరుణంలో ఇలాంటి చర్యలు దేశ ఆర్థిక వ్యవస్థకు అంతగా మంచి చేయవని హితవు పలికారు.

ఓపీఎస్‌లో పింఛను మొత్తాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరించేది. దీన్ని 2003లో అప్పటి ఎన్‌డీఏ ప్రభుత్వం రద్దు చేసింది. 2004 ఏప్రిల్‌ 1 నుంచి కొత్త పింఛను పథకాన్ని (NPS) అమల్లోకి తీసుకొచ్చింది. దీంట్లో ఉద్యోగులు తమ మూల వేతనం నుంచి 10 శాతం పింఛను కింద జమచేయాల్సి ఉంటుంది. ప్రభుత్వాలు తమ వంతుగా 14 శాతం ఇస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌పాలిత రాష్ట్రాలైన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ఓపీఎస్‌ను అమలు చేయాలని నిర్ణయించాయి. హిమాచల్‌ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న భాజపా రానున్న ఎన్నికల్లో గెలిస్తే ఓపీఎస్‌ను పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చింది. ఝార్ఖండ్‌ సైతం ఓపీఎస్‌ పద్ధతిలోకి మారాలని ఇటీవలే నిర్ణయించింది. మరోవైపు పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ప్రభుత్వం సైతం పాత పింఛను విధానంలోకి మారనున్నట్లు ప్రకటించింది.

దీర్ఘకాలంలో దేశ ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ పార్టీలు నడుచుకోవాల్సిన అవసరం ఉందని బేరీ సూచించారు. పాత పింఛను పథకం వల్ల ప్రస్తుతానికి ప్రభుత్వాలు లాభపడినప్పటికీ.. భవిష్యత్తుల్లో రాబోయే ప్రభుత్వాలతో పాటు పౌరులు సైతం పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీలు దీన్ని గ్రహించి ముందే అప్రమత్తం కావాల్సిన అసవరం ఉందన్నారు.

మరోవైపు అధికారిక ‘దారిద్య్ర రేఖ ( poverty line)’ను  నీతి ఆయోగ్‌ ఎప్పుడు నిర్ణయిస్తుందని బేరీని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఐరాస అభివృద్ధి పథకం విడుదల చేస్తున్న ‘బహుముఖ పేదరిక సూచీ (MPI)’తో తాము సంతృప్తిగానే ఉన్నామని తెలిపారు. పౌష్టికాహారం, విద్య, జీవనప్రమాణాలు సహా మొత్తం 12 అంశాలను పరిగణనలోకి తీసుకొని దీన్ని మదింపు చేస్తున్నట్లు వెల్లడించారు. ‘వినియోగదారుల వ్యయ సర్వే’ ఫలితాలు వచ్చిన తర్వాతే కొత్త దారిద్య్ర రేఖను నిర్ణయించగలమని తెలిపారు. అది కేంద్ర గణాంకశాఖ వచ్చే ఏడాదిలో విడుదల చేసే అవకాశం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు