Income Tax: పన్ను విధానాల్లో ఎటువంటి మార్పులు లేవు: ఆర్థిక మంత్రి

ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో పన్నులకు సంబంధించి ఎటువంటి పెద్ద ప్రకటనలు లేవు. ప్రత్యక్ష పన్నుల్లో వివాదాలకు సంబంధించిన నోటీసులపై మాత్రం కొంత ఊరటనిచ్చారు.  

Updated : 01 Feb 2024 17:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఎన్నికల ముందు ప్రవేశపెట్టిన తాత్కాలిక బడ్జెట్‌లో పన్ను విధానాల్లో మార్పుల జోలికి ఆర్థిక మంత్రి వెళ్లలేదు. ఆదాయపు పన్ను ( Income tax) కొత్త విధానంలో వారికి రూ.7 లక్షల వరకు ఎటువంటి పన్ను ఉండదని పునరుద్ఘాటించారు. ఇది 2013 - 14లో రూ.2.2 లక్షలుగా ఉందని గుర్తు చేశారు. కార్పొరేట్‌ పన్నును దేశీయ కంపెనీలకు 30 శాతం నుంచి 22 శాతానికి.. కొన్ని రకాల తయారీ రంగ సంస్థలకు 15 శాతానికి తగ్గించినట్లు వెల్లడించారు. ప్రజల సగటు వాస్తవిక ఆదాయం 50శాతం పెరిగినట్లు చెప్పారు.  

ప్రత్యక్ష పన్నులకు సంబంధించి వివాదాస్పద డిమాండ్‌ నోటీసులు అందుకొన్న వారికి ఊరటనిచ్చారు. 2009 - 10 మధ్య రూ.25 వేల వరకు విలువైన డిమాండ్‌ నోటీసులను ఉపసంహరించుకొన్నారు.  2010 - 11 నుంచి 2014 - 15 ఆర్థిక సంవత్సరాల మధ్య రూ.10 వేల వరకు చెల్లించాలని జారీ అయిన నోటీసులను రద్దు చేశారు. దీంతో దాదాపు కోటి మంది లబ్ధి పొందనున్నట్లు ఆమె తెలిపారు. వ్యాపారాలను సరళతరం చేయడానికి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పేర్కొన్నారు. ఈక్రమంలో చిన్న మొత్తంలో ఉన్న ప్రత్యక్షపన్ను వివాదాస్పద డిమాండ్ల (నోటీసులు)ను రద్దు చేసుకొంటున్నట్లు వివరించారు. 

ఆదాయపు పన్ను రిఫండ్‌ సమయాన్ని తమ ప్రభుత్వం గణనీయంగా తగ్గించిందని ఆర్థిక మంత్రి వెల్లడించారు.  2013-14లో ఇది సగటున 93 రోజులు ఉండగా.. ప్రస్తుతం దానిని 10 రోజులకు తీసుకురాగలిగామని వెల్లడించారు. 

  • ఆదాయపన్ను వర్గాలు తెలుసుకోండివి!
  • 2023-24 సంవత్సరంలో కొత్త పన్ను విధానం ఎంచుకున్న వారు, 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంచుకునేవారు ఈ విషయాలను గుర్తు పెట్టుకోండి.
  • ఇన్‌కమ్‌ట్యాక్స్‌ శ్లాబ్‌లను ఆరు తరగతుల నుంచి ఐదుకు తగ్గించారు.
  • కొత్త పన్ను విధానంలో మినహాయింపు రూ.2.5లక్షల నుంచి రూ.3లక్షల పెంచారు. (2023-24 బడ్జెట్‌)
  • సెక్షన్‌ 87A ప్రకారం రూ.7లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.
  • అధిక ఆదాయం కలిగిన వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాల (హెచ్‌యూఎఫ్‌) సర్‌ఛార్జీని తగ్గించారు. రూ.5కోట్లకు మించి ఆదాయం ఉన్న వారికి 37శాతం సర్‌ఛార్జీ వర్తిస్తుండగా 25శాతానికి తగ్గించారు.
  • పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను లేదా పాత పన్ను విధానంలో ఏదో ఒకదానికి ఒకదానిని ఎంచుకునే వీలుంది. పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు వెబ్‌సైట్‌లో కొత్త పన్ను విధానమే డిఫాల్ట్‌గా ఉంటుంది.
  • పాత పన్ను విధానంలో రూ.50వేల ప్రామాణికత తగ్గింపును అనుమతించేవారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారికీ ఈ మినహాయింపు వర్తించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని