Adani Group: ‘అదానీ’పై విచారణకు ప్రభుత్వ కమిటీ ఏమీ లేదు: కేంద్రం

Adani Group: అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్‌ చేసిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు ప్రభుత్వం తరఫున ఎలాంటి కమిటీ ఏర్పాటు చేయలేని ప్రభుత్వం తెలిపింది.

Published : 13 Mar 2023 19:14 IST

దిల్లీ: అదానీ గ్రూప్‌ (Adani Group)పై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ చేసిన ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఎలాంటి కమిటీ ఏర్పాటు చేయలేదని కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ ఈ వ్యవహారంపై దర్యాప్తు జరుపుతోందని పేర్కొన్నారు. అలాగే అదానీ కంపెనీ ఇండోనేషియా నుంచి చేసుకుంటున్న బొగ్గు దిగుమతిపై కొనసాగుతున్న విచారణ ఇంకా ముగియలేదని వెల్లడించారు. లోక్‌సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సోమవారం రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

అదానీ గ్రూప్‌ (Adani Group)లోని తొమ్మిది నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ 2023 జనవరి 24 నుంచి మార్చి 1 మధ్య 60 శాతం కుంగినట్లు మరో ప్రశ్నకు బదులిస్తూ పంకజ్‌ చౌదరి వెల్లడించారు. ఇన్వెస్టర్ల ప్రయోజనాలను కాపాడడంతో పాటు మార్కెట్‌లో స్థిరత్వం వచ్చేలా నియంత్రణా సంస్థ సెబీ చర్యలు తీసుకోవాల్సి ఉందని తెలిపారు. అవసరమైతే విచారణ కూడా జరిపే అధికారం ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే అదానీ గ్రూప్‌ (Adani Group)పై దర్యాప్తు ప్రారంభించిందన్నారు.

మరోవైపు అదానీ (Adani Group) కంపెనీ దిగుమతి చేసుకుంటున్న విద్యుత్‌ ఉత్పత్తి, సరఫరా పరికరాల వ్యవహారంపై డీఆర్‌ఐ జరిపిన విచారణ ముగిసిందని మంత్రి తెలిపారు. నివేదికను సంబంధించిన న్యాయ అధికారులకు సమర్పించినట్లు వెల్లడించారు. అలాగే అదానీ షేర్లలోని ఒడుదొడుకుల వల్ల స్థూలంగా మార్కెట్‌ వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడలేదని పేర్కొన్నారు. నిఫ్టీ 50 సూచీ గత రెండు నెలల వ్యవధిలో 4.9 శాతం కుంగినట్లు గుర్తుచేశారు.

ప్రభుత్వ ఆధీనంలోని ఎల్‌ఐసీకి అదానీ గ్రూప్‌ (Adani Group) 2023 మార్చి 5 నాటికి రూ.6,182.64 కోట్ల రుణాలు బకాయి పడిందని పంకజ్‌ చౌదరి తెలిపారు. మరోవైపు అదానీ సంస్థలకు తాము ఎలాంటి రుణాలు ఇవ్వలేదని ఐదు ప్రభుత్వ రంగ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలు వెల్లడించినట్లు పేర్కొన్నారు. అలాగే ప్రభుత్వ బ్యాంకులు ఆయా కంపెనీల పనితీరు, ప్రాజెక్టుల అమలు, రిస్క్‌ను అంచనా వేసిన తర్వాతే రుణాలు మంజూరు చేశాయని తెలిపారు.

అదానీ -హిండెన్‌బర్గ్‌ వ్యవహారంపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు ఇటీవల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అదానీ గ్రూప్ షేర్ల పతనంతో సహా స్టాక్‌ మార్కెట్లలో రెగ్యులేటరీ అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. కమిటీకి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ అభయ్ మనోహర్ సప్రే నేతృత్వం వహిస్తారు. కేంద్రం సమర్పించిన నిపుణల కమిటీ ప్రతిపాదనను తిరస్కరించిన సుప్రీం.. ఆ కమిటీని తామే నియమిస్తామని గత విచారణలో వెల్లడించింది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) కొనసాగిస్తున్న విచారణను రెండు నెలల్లో పూర్తి చేసి నివేదికను సీల్డ్‌ కవర్లో సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని