స్పామ్‌ కాల్స్‌కు ఇక గుడ్‌బై.. త్వరలో కొత్త మార్గదర్శకాలు

స్పామ్‌ కాల్స్‌ను నియంత్రించేందుకు కేంద్రం నడుంబిగించింది. ఇకపై వాటికి స్వస్తి చెప్పేందుకు కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది.

Published : 15 May 2024 17:15 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కాంటాక్ట్‌లో లేని నంబర్‌ నుంచి కాల్‌ లిఫ్ట్‌ చేయగానే.. లోన్‌ కావాలా? క్రెడిట్‌ కార్డ్‌ కావాలా అని అడుగుతుంటారు. ఒక్కోరోజు ఈ తరహా కాల్స్‌ పదుల సంఖ్యలో వస్తుంటాయి. ఏదైనా పనిలో ఉన్నప్పుడు ఇలాంటి కాల్స్‌ వస్తే చిరాకు, కోపం వచ్చేస్తుంటుంది. ఈ తరహా కాల్స్‌ను నియంత్రించేందుకు టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ ఇప్పటికే అనేక రకాల చర్యలు తీసుకుంటోంది. తాజాగా వీటికి చెక్‌ పెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. త్వరలో కొత్త మార్గదర్శకాలు జారీ చేయనుంది.

డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఇలాంటి కాల్స్ నియంత్రణ కోసం మార్గదర్శకాలు రూపొందించింది. రిజిస్టర్‌ కానీ మొబైల్‌ నంబర్లు, అన్‌వాంటెండ్‌ కాల్స్‌ నియంత్రణకు ఇందులో పరిష్కారాలను ప్రతిపాదించింది. సాధారణంగా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, రియల్‌ ఎస్టేట్‌ సంస్థల నుంచి అధికంగా వస్తుంటాయి. ఇలాంటి కాల్స్‌ నుంచి ప్రయోజనం పొందుతున్న కంపెనీలే వీటికి బాధ్యత వహించాల్సి ఉంటుంది.  ట్రాయ్‌ మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే టెలికాం సంస్థలు జరిమానాలూ ఎదుర్కోవాల్సి ఉంటుంది. 

ప్రాజెక్ట్‌ అస్త్ర.. జీమెయిల్‌లో జెమినీ.. లెక్కల్లో సాయం.. గూగుల్‌ కొత్త అప్‌డేట్స్!

ఇక టెలికాం కంపెనీలు కాల్స్‌ను గుర్తించడానికి వీలుగా వాటి ఐడెంటిటీని వెల్లడించాల్సి ఉంటుంది. ఇందుకు మూడు వేర్వేరు సిరీస్‌లను తీసుకురానున్నారు. మార్కెటింగ్ కాల్స్‌కు 140, సర్వీస్‌ కాల్స్‌ కోసం 160, ప్రభుత్వ ఏజెన్సీల ద్వారా కమ్యూనికేషన్‌ కోసం 111 ఇవ్వాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. టెలికాం ఆపరేటర్లు ప్రతీ కాలర్‌ పేరు, సెక్టార్‌తో సహా బహిర్గతం చేయాల్సిఉంటుంది. దీంతో వినియోగదారులు వారికి వచ్చే కాల్స్‌ను తిరస్కరించాలా? వద్దా? అని వారే నిర్ణయించుకోవచ్చు. వినియోగదారుల వ్యవహారాల శాఖ టెలికాం సంస్థలతో గత వారంలో చర్చలు జరిపిన తర్వాత ఈ మార్గదర్శకాలు రూపొందించిందని సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు