యూపీఐ లావాదేవీలు.. ఫోన్‌పే, గూగుల్‌పే ఆధిపత్యానికి NPCI చెక్‌..!

యూపీఐ చెల్లింపుల వ్యవస్థలో ఫోన్‌పే, గూగుల్‌పే ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు ఎన్‌పీసీఐ సిద్ధమైంది.

Updated : 17 Apr 2024 18:52 IST

దిల్లీ: దేశీయంగా యూపీఐ (UPI) చెల్లింపుల వ్యవస్థలో ఫోన్‌పే, గూగుల్‌ పే ఆధిపత్యం కొనసాగుతోంది. నిన్న మొన్నటివరకు ఎంతోకొంత పోటీ ఇచ్చిన పేటీఎం.. ఆర్‌బీఐ ఆంక్షల మూలంగా పోటీలో వెనకబడింది. దీంతో యూపీఐ లావాదేవీల్లో విలువపరంగా ఈ రెండు సంస్థల వాటా 86 శాతానికి చేరుకుంది. వీటి గుత్తాధిపత్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈక్రమంలో నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) రంగంలోకి దిగింది. వీటి ఆధిపత్యానికి చెక్‌ పెట్టేందుకు ఫిన్‌టెక్‌ స్టార్టప్‌లతో త్వరలో భేటీ కానుంది.

యూపీఐ లావాదేవీల్లో గుత్తాదిపత్యంపై ఇటీవల ఆర్‌బీఐ ఆందోళన వ్యక్తంచేసింది. పార్లమెంటరీ ప్యానెల్‌ సైతం ఇదే అంశాన్ని గతంలో లేవనెత్తింది. ఈనేపథ్యంలో ఎన్‌పీసీఐ ప్రతినిధులు క్రెడ్‌, ఫ్లిప్‌కార్ట్‌, జొమాటో, అమెజాన్‌, ఇతర ఫిన్‌టెక్‌ సంస్థలతో భేటీ కానున్నారు. ఈ భేటీకి ఫోన్‌పే, గూగుల్‌ పే, పేటీఎంను ఆహ్వానించలేదని ‘టెక్‌ క్రంచ్‌’ వెబ్‌సైట్‌ పేర్కొంది. తమ వేదికలపై యూపీఐ లావాదేవీల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే ఆయా సంస్థల ప్రతినిధులతో సంప్రదింపులు జరుపుతోంది. 

మార్కెట్‌ వాటా పెంచుకోవడానికి యూజర్లకు ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రోత్సహిస్తోంది. కొత్తగా వచ్చిన యూపీఐ ప్లేయర్లకు అనుకూల వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతో ప్రోత్సాహాకాలు అందించే ప్రణాళికపై ఆర్‌బీఐ సైతం సుముఖంగా ఉంది. మరోవైపు డిజిటల్‌ చెల్లింపు లావాదేవీల్లో 30 శాతం పరిమాణ పరిమితి పాటించేందుకు ఇచ్చిన గడువు ఈ ఏడాది డిసెంబర్‌ 31తో ముగియనుంది. మొత్తం యూపీఐ లావాదేవీల పరిమాణంలో 30 శాతానికి మించి ఒక థర్డ్‌ పార్టీ యాప్‌ కలిగిఉండరాదని 2020 నవంబరులో ఎన్‌పీసీఐ పరిమితి తీసుకొచ్చింది. ఆ నిర్ణయం అమలును పలుమార్లు పొడిగించుకుంటూ వచ్చింది. మరికొన్ని నెలల్లో ఈ గడువు ముగియనుంది. ఈ క్రమంలోనే ఎన్‌పీసీఐ తనవంతు చర్యలకు సిద్ధమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని