Bank Frauds: ఆర్‌బీఐ నివేదిక: పెరిగిన మోసాలు.. ఈ బ్యాంకుల్లోనే అధికం..!

బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలకు సంబంధించి ఆర్‌బీఐ కీలక వివరాలు వెల్లడించింది. ఏటికేడు ఈ సంఖ్య పెరుగుతోందని తెలిపింది.

Updated : 30 May 2024 16:27 IST

Bank Frauds | ముంబయి: దేశంలో బ్యాంకింగ్‌ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 36,075 మోసాలు నమోదయ్యాయి. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 9,046, 2022-23 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 13,564 మోసాలతో పోలిస్తే ఈ సంఖ్య చాలా అధికం. అయితే, ఈ మోసాల్లో పోగొట్టుకున్న సొమ్ము మాత్రం గణనీయంగా తగ్గింది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే క్రితం ఏడాది రూ.26,127 కోట్ల నుంచి రూ.13,930 కోట్లకు తగ్గిందని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గురువారం వెలువరించిన తన వార్షిక నివేదికలో వెల్లడించింది.

గడిచిన మూడేళ్లలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లో మోసాలు ఎక్కువగా నమోదవ్వగా.. పోగొట్టుకున్న మొత్తం విషయంలో ప్రభుత్వరంగ బ్యాంకులు ముందువరుసలో నిలిచినట్లు ఆర్‌బీఐ తన నివేదికలో తెలిపింది. డిజిటల్‌ పేమెంట్స్‌ (కార్డు పేమెంట్స్‌, ఇంటర్నెట్‌ ) మోసాలు అధిక సంఖ్యలో నమోదు కాగా.. లోన్‌ పోర్ట్‌ఫోలియోలో అధిక మొత్తంలో నగదు మోసగాళ్ల బారిన పడినట్లు నివేదికలో వెల్లడించింది. ఈ విషయంలోనూ ప్రభుత్వరంగ బ్యాంకులే ముందువరుసలో ఉన్నట్లు పేర్కొంది.

రికార్డుల్ని బద్దలు కొట్టిన జియో సినిమా.. ఐపీఎల్‌కు 62కోట్ల వ్యూస్‌‌!

2021-22లో 3,596 కార్డు, ఇంటర్నెట్‌ మోసాలు నమోదు కాగా.. ఆ సంఖ్య 2023-24లో 29,082కు పెరిగినట్లు ఆర్‌బీఐ నివేదిక తెలిపింది. ఇందులో కొద్దిపాటి నగదు మొత్తాలు అధిక సంఖ్యలో ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఈ తరహా మోసాల వల్ల కోల్పోయిన మొత్తం గడిచిన రెండేళ్లలో రూ.155 కోట్ల నుంచి రూ.1,457 కోట్లకు పెరిగింది. 2022-23, 23-24 ఆర్థిక సంవత్సరాల్లో నమోదైన మోసాలకు సంబందించి మరో ఆసక్తికర అంశాన్ని ఆర్‌బీఐ బయటపెట్టింది. మోసం జరిగిన తేదీకి, గుర్తించడానికి మధ్య చాలా గ్యాప్‌ ఉంటోందని ఆర్‌బీఐ గుర్తించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని