Nvidia: యాపిల్‌ను దాటేసిన ఎన్విడియా.. రెండో అత్యంత విలువైన కంపెనీగా అవతరణ

ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీల జాబితాలో ఎన్విడియా రెండో స్థానానికి చేరింది. బుధవారం అమెరికా మార్కెట్లలో కంపెనీ షేరు విలువ భారీగా పెరిగింది. 

Updated : 06 Jun 2024 13:04 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా (Nvidia) అవతరించింది. దాని మార్కెట్‌ విలువ బుధవారం నాటి ట్రేడింగ్‌లో 5 శాతం పెరిగింది. దీంతో ఒక్కో షేరు ధర 1,224 డాలర్లకు చేరింది. దీంతో కంపెనీ విలువ 3 ట్రిలియన్‌ డాలర్లకు పెరిగింది. ఇప్పటి వరకు ప్రపంచంలో రెండో అత్యంత విలువైన కంపెనీగా నిలిచిన యాపిల్‌.. ఇప్పుడు తృతీయ స్థానంలోకి చేరింది.

ఎన్విడియా కంపెనీ జూన్‌ 7 తేదీన షేర్లను విభజించేందుకు సిద్ధమైంది. దీంతో మార్కెట్లో కంపెనీ షేర్ల విలువ గణనీయంగా పెరిగింది. 2007లో ఐఫోన్‌ విక్రయాలు మొదలైన నాటి నుంచి అమెరికా మార్కెట్లలో యాపిల్‌ ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. తాజాగా ఎన్విడియా దాని స్థానాన్ని ఆక్రమించింది. 2024లో కంపెనీ షేరు విలువ 147శాతం పెరిగింది. అత్యాధునిక ప్రాసెసర్లకు డిమాండ్‌ గణనీయంగా వృద్ధి చెందడమే దీనికి కారణం. మైక్రోసాఫ్ట్‌, మెటా ప్లాట్‌ఫామ్స్‌, ఆల్ఫాబెట్‌ వేగంగా ఏఐను విస్తరిస్తుండటమే దీనికి కారణం. మే 22 నుంచి దీని స్టాక్‌ విలువ దాదాపు 30శాతం పెరిగింది.  బుధవారం ట్రేడింగ్‌ ముగిసే నాటికి ఎన్విడియా విలువ 3.004 ట్రిలియన్‌ డాలర్లుగా.. యాపిల్‌ విలువ 3.000 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్‌ కొనసాగుతోంది.

1993లో ఎన్విడియాను ప్రారంభించారు. ఈ సంస్థ చిప్స్‌ను కంప్యూటర్లలో ఒక రకమైన గ్రాఫిక్స్‌ను ప్రాసెస్‌ చేసేందుకు వినియోగిస్తారు. వీటిని కంప్యూటర్‌ గేమ్స్‌ కోసం కూడా వినియోగిస్తారు. ఏఐ విప్లవానికి చాలా ముందుగానే ఈ కంపెనీ మెషిన్‌ లెర్నింగ్‌కు సహకరించేలా చిప్స్‌లో మార్పులు చేయడం మొదలుపెట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌ త్రైమాసికంలో కంపెనీ 26 బిలియన్‌ డాలర్లు విక్రయాలు జరిపింది. గతేడాది తో పోలిస్తే ఇవి మూడు రెట్లు అయ్యాయి. గత మూడు నెల్లలోనే ఇవి 18 శాతం పెరిగాయంటే వృద్ధి వేగాన్ని అర్థం చేసుకోవచ్చు. మరో వైపు యాపిల్‌ వృద్ధి రేటు మాత్రం మందగించింది. దీంతో తన స్థానాన్ని ఎన్విడియాకు కోల్పోయింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు