Interest Rate Hike: అదే జరిగితే వడ్డీరేట్ల పెంపు మళ్లీ మొదలవుతుంది: మోర్గాన్‌ స్టాన్లీ

Interest Rate Hike: ముడి చమురు ధరల పెరుగుదల భారత ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని మోపుతుందని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. ధరలు ఓ స్థాయిని దాటితే వడ్డీరేట్ల పెంపు అనివార్యమయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.

Published : 06 Nov 2023 18:33 IST

దిల్లీ: ముడి చమురు ధరలు (Crude Oil Prices) పెరిగితే భారత ఆర్థిక వ్యవస్థలో అస్థిర పరిస్థితులు తప్పవని ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్ మోర్గాన్‌ స్టాన్లీ అంచనా వేసింది. బ్యారెల్‌ చమురు ధర 110 డాలర్లకు చేరితే వడ్డీరేట్ల పెంపు (Interest Rate Hike)ను ఆర్‌బీఐ మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఉందని తెలిపింది. భారత్‌ చమురు అవసరాల్లో అత్యధికంగా దిగుమతులపైనే ఆధారపడుతున్న విషయం తెలిసిందే. బ్యారెల్‌ ధర 10 డాలర్లు పెరిగితే ద్రవ్యోల్బణం 50 బేసిస్‌ పాయింట్ల వరకు పెరగొచ్చని మోర్గాన్‌ స్టాన్లీ ఆర్థికవేత్తలు అంచనా వేశారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు బ్యారెల్‌ ధర (Crude Oil Prices) 110 డాలర్లు దాటితే భారత ఆర్థిక వ్యవస్థ అస్థిర పరిస్థితులు ఎదుర్కొంటుందని ఈ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ అంచనా వేసింది. దేశీయంగా ఇంధన ధరలు పెరిగి మరోసారి ద్రవ్యోల్బణ ప్రభావం తెరపైకి వస్తుందని వివరించింది. ఫలితంగా ప్రస్తుత ఖాతా లోటు సాధారణ 2.5 శాతం ఎగువకు చేరుతుందని తెలిపింది. ఈ క్రమంలో రూపాయి విలువ సైతం క్షీణిస్తుందని పేర్కొంది.

ఆర్‌బీఐ గత నాలుగు దఫాలుగా వడ్డీరేట్ల (Interest Rate)ను యథాతథంగా కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. అయితే, ద్రవ్యోల్బణం నాలుగు శాతం దిగువన స్థిరపడే వరకు కఠిన విధాన వైఖరిని కొనసాగిస్తామని చెబుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ముడి చమురు ధరలు 95 డాలర్లకు చేరే వరకు ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉంటుందని మోర్గాన్‌ స్టాన్లీ తెలిపింది. అది దాటితే మాత్రం వడ్డీరేట్ల పెంపు అనివార్యమవుతుందని పేర్కొంది. అయితే, ధరలు 95 డాలర్ల వద్ద స్థిరీకరిస్తే మాత్రం రేట్లను పెంచకుండా.. కోతను మాత్రం ఆర్‌బీఐ దీర్ఘకాలం వాయిదా వేసే అవకాశం ఉందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని