OYO CEO: ఘనంగా ఓయో సీఈవో వివాహం.. కొత్త జంటకు కేంద్రమంత్రి విషెష్‌..

ఓయో వ్యవస్థాపకుడు, సీఈవో రితీశ్‌ ఒక ఇంటివాడయ్యారు. గీతాన్హా సూద్‌తో ఆయన వివాహం ఘనంగా జరిగింది. ఈ కొత్త జంటను విష్‌ చేసిన ఫొటోలను కేంద్రమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ ట్విట్‌ చేశారు.

Published : 07 Mar 2023 21:17 IST

దిల్లీ: ఆతిథ్య సేవలందించే ఓయో (OYO) సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో రితేశ్‌ అగర్వాల్‌ (Ritesh Agarwal) వివాహం ఘనంగా జరిగింది. రితేశ్ అగర్వాల్‌- గీతాన్షా సూద్‌ జంటను కలిసిన కేంద్ర సహాయ మంత్రి ప్రహ్లాద్‌ సింగ్‌ పటేల్‌ వారికి శుభాకాంక్షలు చెప్పి ఆశీర్వదించారు. మరోవైపు, రీతేశ్-గీతాన్షా సూద్‌ వివాహ రిసెప్షన్‌ దిల్లీలోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరగనుంది.  వివాహ రిసెప్షన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్ అంబానీ, ఇతర రాజకీయ, వాణిజ్యరంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. మరోవైపు, ఈ కొత్త జంటను కలిసి అభినందనలు తెలుపుతూ ఉన్న ఫొటోలను ప్రహ్లాద్‌ సింగ్‌పటేల్‌ ట్వీట్‌ చేశారు.  దీనిపై రితేశ్‌ రిప్లయ్‌ ఇచ్చారు. ‘మీ శుభాకాంక్షలు, ఆశీర్వాదాలకు ధన్యవాదాలు..’ అని పేర్కొన్నారు.  ఫిబ్రవరిలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మూ, ప్రధాని నరేంద్ర మోదీని కలిసి తమ పెళ్లికి  ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే, రితేశ్‌ జీవిత భాగస్వామికి సంబంధించిన వివరాలు మాత్రం తెలియలేదు.

రితేశ్‌ ఆస్తుల విలువ తెలుసా?

ఒడిశాలోని రాయగఢలో మార్వారీ కుటుంబంలో జన్మించిన రితేశ్‌ అగర్వాల్‌.. 2013లో ఓయోను స్థాపించి సక్సెస్‌ అయ్యారు. తక్కువ కాలంలోనే బిలియనీర్‌గా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. గతంలో ఆయన కుటుంబం దక్షిణ ఒడిశాలోని రాయగఢ్‌ నగరంలో చిన్న దుకాణం నిర్వహిస్తుండేది. అప్పుడు రితేశ్‌ సిమ్‌కార్డులను విక్రయిస్తుండేవారట. రాయగఢలోనే పాఠశాల విద్యనభ్యసించిన రితేశ్‌.. రాజస్థాన్‌లోని కోటలో సెయింట్‌ జాన్స్‌ సీనియర్‌ సెకెండరీ స్కూల్‌లో ఇంటర్‌ చదివారు. ఆ తర్వాత కళాశాల విద్య కోసం దిల్లీకి వెళ్లి.. రెండేళ్ల తర్వాత డ్రాప్‌ అవుట్‌గా మారారు. ఆ సమయంలోనే ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కోసం ఉద్దేశించిన థీల్ ఫెలోషిప్ ప్రోగ్రామ్‌కు ఎంపికైన రితేశ్‌.. ఈ ఫెలోషిప్‌ సాధించిన వారిలో ఒకరిగా నిలిచారు. 2013 మే నెలలో ఓయో స్థాపించేందుకు లక్ష డాలర్ల గ్రాంటు అందుకున్నారు. 2013 మే నెలలో తక్కువ ధరల్లోనే నాణ్యమైన గదులతో కూడిన హోటల్స్‌ వసతి కల్పించే ఓయో రూమ్స్‌ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన వయస్సు కేవలం 19 ఏళ్లే. 2013లో గుడ్‌గావ్‌లోని ఒక హోటల్‌తో ప్రారంభమైన అనుసంధానం.. ఇప్పుడు 800 నగరాలకు పైగా విస్తరించింది.  ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ ఇప్పుడు 1.1బిలియన్‌ డాలర్లు (దాదాపు 8వేల కోట్లు)కుపైనే. భారత్‌లోనే కాకుండా మిగతా దేశాలకూ తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని