Patanjali: యాడ్‌ సైజ్‌లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం

Patanjali: పతంజలి ఉత్పత్తుల ప్రయోజనాలపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనల కేసులో ఆ కంపెనీపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. క్షమాపణలు చెబుతూ పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని తెలపగా.. అది ఏ సైజ్‌లో ఉందని ధర్మాసనం ప్రశ్నించింది.

Updated : 23 Apr 2024 14:43 IST

Patanjali | దిల్లీ: తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించిన కేసులో బహిరంగ క్షమాపణలు చెబుతూ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబాకు (Ramdev Baba) చెందిన పతంజలి (Patanjali) ఆయుర్వేద మంగళవారం సుప్రీంకోర్టుకు వెల్లడించింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ఉత్పత్తులకు సంబంధించి ఇచ్చే యాడ్‌ల సైజులోనే క్షమాపణల ప్రకటన ఇచ్చారా? మరి ముందే ఎందుకు ప్రచురించలేదు? అంటూ ప్రశ్నలు సంధించింది.

పతంజలి కేసు విచారణ సందర్భంగా ఆ కంపెనీ తరఫున ప్రముఖ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ మంగళవారం వాదనలు వినిపించారు. 67 పత్రికల్లో ప్రకటనలు ఇచ్చామని, అందుకోసం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసినట్లు కోర్టుకు వెల్లడించారు. దీనిపై జస్టిస్‌ హిమా కోహ్లీ స్పందిస్తూ.. ‘‘క్షమాపణలను ప్రముఖంగా ప్రచురించారా? గతంలో ఉత్పత్తుల యాడ్‌లలో ఉపయోగించిన ఫాంట్‌నే వాడారా? అదే సైజ్‌లో క్షమాపణలను పబ్లిష్‌ చేశారా?’’ అని ప్రశ్నించారు. అలాగే రూ.లక్షలు ఖర్చు చేశామన్న రోహత్గీ వాదనపై స్పందిస్తూ.. ‘‘తమకు సంబంధం లేదు’’ అని న్యాయమూర్తి అన్నారు. ఈ నేపథ్యంలో క్షమాపణలు చెబుతూ పెద్ద పరిమాణంలో మరోసారి అదనపు ప్రకటనలు ప్రచురిస్తామని రోహత్గీ కోర్టుకు తెలిపారు. దీంతో విచారణను ధర్మాసనం ఏప్రిల్‌ 30కి వాయిదా వేసింది. కోర్టు ధిక్కార అంశాన్ని సైతం అప్పుడే విచారిస్తామని పేర్కొంది. పత్రికల్లో వచ్చిన క్షమాపణల ప్రకటనలను రెండు రోజుల్లోగా సమర్పించాలని కోర్టు ఆదేశించింది.

ఆధునిక వైద్యవిధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ పతంజలి (Patanjali)పై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ (IMA) సుప్రీంకోర్టు (Supreme Court)లో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గతేడాది నవంబర్‌లో ఆ సంస్థను మందలించింది. దీంతో ఎలాంటి ఉల్లంఘనలూ జరగవంటూ అప్పట్లో సంస్థ తరఫున న్యాయవాది కోర్టుకు హామీ ఇచ్చారు. కానీ, వాటిని ఉల్లంఘించడంతో కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఇప్పటికే రామ్‌దేవ్‌ బాబా, బాలకృష్ణ పలుమార్లు కోర్టుకు బేషరతు క్షమాపణలు చెప్పారు. కోర్టుకు వాటిని అంగీకరించకపోగా.. చర్యలకు సిద్ధంగా ఉండాలని తెలిపింది. అలాగే బహిరంగ క్షమాపణలు చెప్పాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే పత్రికల్లో ప్రకటనల ద్వారా పతంజలి క్షమాపణలు ప్రచురించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు