Paytm: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ రాజీనామా

Paytm: పీపీబీఎల్‌ స్వతంత్ర డైరెక్టర్‌ మంజూ అగర్వాల్‌ రాజీనామా చేసినట్లు వస్తున్న వార్తలను పేటీఎం ధ్రువీకరించింది.

Updated : 12 Feb 2024 13:58 IST

దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)కు స్వతంత్ర డైరెక్టర్‌ మంజూ అగర్వాల్‌ రాజీనామా చేశారు. దీనిపై గతకొన్ని రోజులుగా వస్తున్న వార్తలను సోమవారం పేటీఎం (Paytm) బ్రాండ్ మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ ధ్రువీకరించింది. వ్యక్తిగత కారణాల వల్ల ఫిబ్రవరి 1 నుంచి ఆయన వైదొలిగినట్లు పేర్కొంది. అంతకుముందు ఆర్‌బీఐ (RBI) ఆంక్షల నేపథ్యంలోనే అగర్వాల్‌ తన బాధ్యతల నుంచి తప్పుకొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి.

మరోవైపు నియంత్రణాపరమైన అంశాలు, నిబంధనలను కంపెనీ కచ్చితంగా అమలు చేసేలా ఓ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు పేటీఎం (Paytm) శుక్రవారం వెల్లడించింది. దీంట్లో ఐసీఏఐ మాజీ అధ్యక్షుడు ఎం.ఎం.చితలే, ఆర్‌బీఐ ఎంపిక చేసిన బ్యాంకింగ్‌ కోడ్స్‌ అండ్‌ స్టాండర్డ్స్‌ బోర్డ్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ మాజీ సభ్యుడు ఉంటారని తెలిపింది. బ్యాంకింగ్‌ నిపుణులు ఆర్‌.రామచంద్రణ్‌ వంటివారు కూడా సభ్యులుగా ఉంటారని వెల్లడించింది.

పీపీబీఎల్‌పై RBI ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2024 ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించొద్దని ఆదేశించింది. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా చేయొద్దని తెలిపింది. పీపీబీఎల్‌ కార్యకలాపాలపై బయటి ఆడిటర్లు పూర్తి స్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, లోపాలు ఉన్నాయని ఆడిట్‌లో తేలినందునే సంస్థపై మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సి వస్తోందని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని