Paytm: ‘పేటీఎం పనిచేస్తోంది’.. ఆర్‌బీఐ ఆంక్షల మధ్య వ్యవస్థాపకుడి హామీ!

Paytm: ఆర్‌బీఐ ఆంక్షల వల్ల పేటీఎం కార్యకలాపాలపై ఎలాంటి ప్రభావం ఉండదని సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ తెలిపారు.

Updated : 02 Feb 2024 13:10 IST

దిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆంక్షల వల్ల పేటీఎం (Paytm) కార్యకలాపాలపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సంస్థ వ్యవస్థాపకుడు విజయ్‌శేఖర్‌ శర్మ స్పందించారు. పేటీఎం పనిచేస్తోందని.. ఫిబ్రవరి 29 తర్వాతా యథావిధిగా కొనసాగుతుందని శుక్రవారం ‘ఎక్స్‌’ వేదికగా స్పష్టం చేశారు. ‘‘పేటీఎంకు మద్దతుగా నిలుస్తున్న ప్రతి వినియోగదారుడికీ సెల్యూట్‌ చేస్తున్నా. ప్రతి సవాల్‌కూ ఓ పరిష్కారం ఉంటుంది. నిబంధనలకు లోబడి దేశానికి సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నాం. చెల్లింపుల వ్యవస్థలో భారత్‌ తీసుకొస్తున్న వినూత్న ఆవిష్కరణలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తూనే ఉంటాయి’’ అని విజయ్‌ శేఖర్‌ వ్యాఖ్యానించారు.

ఈనెల 29 తర్వాత డిపాజిట్లు స్వీకరించొద్దని, వాలెట్‌లు- ఫాస్ట్‌ట్యాగ్‌లు టాప్‌అప్‌ చేయొద్దంటూ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL)పై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. అయితే, దీనివల్ల ప్రస్తుతం రుణాలు, బీమా పంపిణీ, ఈక్విటీ బ్రోకింగ్‌ లాంటి ఆర్థిక సేవలపై ప్రభావం ఉండదని పేటీఎం (Paytm) గురువారం స్పష్టం చేసింది. పేటీఎం క్యూఆర్‌, పేటీఎం సౌండ్‌బాక్స్‌, పేటీఎం కార్డ్‌ మెషీన్‌ లాంటి ఆఫ్‌లైన్‌ మర్చంట్‌ పేమెంట్‌ నెట్‌వర్క్‌ సేవలు యథాతథంగానే కొనసాగుతాయని, కొత్త ఆఫ్‌లైన్‌ మర్చంట్స్‌ను నియమించుకుంటామని తెలిపింది.

పీపీబీఎల్‌పై ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో వన్‌97 కమ్యూనికేషన్స్‌ షేరు (Paytm Share Price) వరుసగా రెండోరోజు శుక్రవారం కుదేలైంది. బీఎస్‌ఈలో 20% పతనమై రూ.487.05 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ను తాకింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 20 శాతం కుంగి రూ.487.20కు చేరింది. ఫలితంగా పేటీఎం మార్కెట్‌ విలువ రూ.30,941.15 కోట్లకు పరిమితమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని