Paytm: కొనసాగుతున్న పేటీఎం షేర్ల పతనం.. రూ.26,000 కోట్లు ఆవిరి

Paytm: ఆర్‌బీఐ ఆంక్షల తర్వాత పేటీఎం షేరు విలువ 53 శాతానికి పైగా నష్టపోయింది. దాదాపు రూ.26,000 కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది.

Published : 14 Feb 2024 13:11 IST

ముంబయి: పేటీఎం షేర్ల (Paytm Share Price) పతనం కొనసాగుతోంది. బుధవారం కంపెనీ స్టాక్‌ ధర మరో 9 శాతానికి పైగా కుంగింది. రూ.342 వద్ద 52 వారాల కనిష్ఠాన్ని తాకింది. 2023 అక్టోబర్‌లో నమోదైన ఏడాది గరిష్ఠం రూ.998.3తో పోలిస్తే ఇప్పటి వరకు 65.5 శాతం నష్టపోయింది. పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ (PPBL)పై జనవరి 31న ఆర్‌బీఐ ప్రకటించిన ఆంక్షల తర్వాత అధికంగా కుంగింది. అప్పటి నుంచి 53 శాతానికి పైగా నష్టపోయింది. దాదాపు రూ.26,000 కోట్ల మదుపర్ల సంపద ఆవిరైంది. మరోవైపు పేటీఎం ఇబ్బందులకు ఇప్పట్లో తెరపడే సూచనలు కనిపించడం లేదు. కంపెనీపై (Paytm) ఆంక్షలను సమీక్షించటం లేదని ఆర్‌బీఐ సోమవారం వెల్లడించింది. ఫలితంగా పలు బ్రోకరేజీ సంస్థలు షేరు టార్గెట్‌ ధరను కుదించాయి.

పీపీబీఎల్‌పై RBI ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. 2024 ఫిబ్రవరి 29 నుంచి డిపాజిట్లను స్వీకరించొద్దని ఆదేశించింది. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా చేయొద్దని తెలిపింది. సమగ్ర పరిశీలన అనంతరమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. ప్రస్తుతానికి వీటిని సడలించడంపై ఎలాంటి సమీక్ష జరపడం లేదని సోమవారం స్పష్టం చేసింది.

డిసెంబర్‌లో ఎఫ్‌ఐఐల భారీ విక్రయం..

డిసెంబర్‌ త్రైమాసికంలో విదేశీ సంస్థాగత మదుపర్లు (FII) రూ.7,441 కోట్లు విలువ చేసే పేటీఎం షేర్లను విక్రయించినట్లు ప్రైమ్‌ డేటాబేస్‌ వెల్లడించింది. అంతక్రితం త్రైమాసికంలో ఈ కంపెనీలో వారి వాటా విలువ రూ.33,148 కోట్లుగా ఉండగా.. అది రూ.25,706 కోట్లకు తగ్గింది. డిసెంబరుతో ముగిసిన మూడు నెలల వ్యవధిలో ఎఫ్‌ఐఐలు నికర అమ్మకందారులుగా నిలవడంలో పేటీఎం షేర్ల విక్రయమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని