Piyush Goyal: మన స్టార్టప్‌లు చిప్స్‌, ఐస్‌క్రీమ్‌ల దగ్గరే ఆగిపోకూడదు: పీయూష్‌ గోయల్ కీలక వ్యాఖ్యలు

Eenadu icon
By Business News Team Updated : 04 Apr 2025 13:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత్ స్టార్టప్‌ (startups)లను ఉద్దేశించి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌ గోయల్ (Piyush Goyal) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని పలు అంకుర సంస్థలు ఫుడ్ డెలివరీ, బెట్టింగ్‌, ఫాంటసీ స్పోర్ట్స్ వంటి యాప్‌లపై ఎక్కువగా దృష్టి సారించాయన్నారు. కానీ చైనాలోని స్టార్టప్‌లు మాత్రం ఇందుకు భిన్నమైన రంగాలను ఎంచుకుంటున్నాయని చెప్పారు.

‘‘దేశంలో ప్రస్తుతం ఉన్న స్టార్టప్‌ల పరిస్థితి చూస్తే.. మనం ఫుడ్ డెలివరీ యాప్స్‌పై దృష్టిసారించాం. ఇలాంటి వాటి వల్ల దిగువ శ్రేణి కార్మికులు తయారై సంపన్నులు కాలు బయటపెట్టకుండా ఆహారం పొందగలుతున్నారు. ఇదే సమయంలో చైనా సంస్థలు ఏఐ, ఈవీలు, సెమీ కండక్టర్ల రంగాలను ఎంచుకుంటున్నాయి. భారత్‌లో డీప్-టెక్ స్టార్టప్‌లు పరిమిత సంఖ్యలోనే వస్తున్నాయి. ఆ రంగంలో కేవలం 1,000 స్టార్టప్‌లు మాత్రమే ఉండటం ఆందోళనకర పరిస్థితి. ఇక్కడి యువతరం గొప్ప ఆలోచనలు రూ.25 లక్షలు, రూ.50 లక్షలకు విదేశీ కంపెనీలకు అమ్ముడుపోతున్నాయి. కొత్త అంకుర సంస్థలు భవిష్యత్‌ తరాల కోసం దేశాన్ని సిద్ధం చేయాలి. మనం ఐస్‌క్రీం, చిప్స్‌ అమ్మడం దగ్గరే ఆగిపోకూడదు. డెలివరీ బాయ్స్‌/గర్ల్స్‌గానే మిగిలిపోదామా? అదే భారత్‌ లక్ష్యమా..? అది అంకురాల ఉద్దేశం కాదు’’ అని స్టార్టప్ మహాకుంబ్ కార్యక్రమంలో తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

విమర్శించడం తేలిక: జెప్టో సీఈఓ 

పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలపై క్విక్‌ కామర్స్ సంస్థ జెప్టో సీఈఓ అదిత్‌ పలిచా స్పందించారు. విమర్శించడం తేలిక అంటూ మంత్రి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ‘‘యూఎస్, చైనాలోని డీప్‌ టెక్‌ నైపుణ్యంతో పోల్చి, భారత్‌లోని కన్జ్యూమర్‌ ఇంటర్నెట్ స్టార్టప్‌లను విమర్శించడం చాలా తేలిక. ప్రస్తుతం జెప్టోలో 1.5 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. 3.5 సంవత్సరాల క్రితం అసలు ఆ సంస్థే లేదు. మేం పన్నులు చెల్లిస్తున్నాం. దేశంలోకి విదేశీ పెట్టుబడులు వచ్చాయి. సరఫరా గొలుసులను నిర్వహించేందుకు వందల కోట్ల పెట్టుబడులు పెట్టారు. భారత ఆవిష్కరణల్లో ఇదొక అద్భుతం కాకపోతే.. మరి దీన్ని ఏమంటారో నాకు తెలియదు.

భారత్‌కు భారీస్థాయిలో ఏఐ మోడల్ ఎందుకు లేదు..? ఎందుకంటే, అమెజాన్‌, ఫేస్‌బుక్‌, అలీబాబా, గూగుల్ వంటి పెద్ద ఇంటర్నెట్‌ సంస్థలు ఇక్కడ లేవు. అవి కూడా కన్జ్యూమర్ ఇంటర్నెట్‌ కంపెనీలుగా ప్రస్థానం మొదలుపెట్టినవే. అవే ఏఐ వంటి ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్తున్నాయి. వాటి వద్ద విస్తృత డేటా, టాలెంట్, పెట్టుబడులు ఉన్నాయి. అందుకే అది సాధ్యమైంది. స్టార్టప్‌ ఎకోసిస్టమ్, ప్రభుత్వం, మూలధనాన్ని కలిగి ఉన్న యాజమాన్యాలు.. ఈ స్థానిక ఛాంపియన్లకు మద్దతు ఇవ్వాలి. అంతేగానీ ఎదగడానికి ప్రయత్నిస్తున్నవారిని అణచి వేయకూడదు’’ అని పలిచా అన్నారు. భారత స్టార్టప్‌లను తక్కువ చేయొద్దని, డీప్‌టెక్ సంస్థల వృద్ధి కోసం ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తోందని ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్‌ పాయ్ ప్రశ్నించారు.

Tags :
Published : 04 Apr 2025 10:02 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని