2031కి రిటైల్‌ విపణి రెట్టింపు

భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు.

Updated : 18 May 2024 01:36 IST

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: భారత వినియోగ వస్తు- సేవల విపణి 2031 కల్లా రెట్టింపు కావొచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అభిప్రాయపడ్డారు. వినియోగంలో వృద్ధి ఇందుకు దోహదం చేస్తుందని, తద్వారా మున్ముందు కూడా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ కొనసాగుతుందని ఆమె అన్నారు. సీఐఐ వార్షిక బిజినెస్‌ సదస్సులో పరిశ్రమ సంస్థల అధిపతులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆమె ప్రసంగించారు. ‘గతంలో కార్పొరేట్, బ్యాంకింగ్‌ వ్యవస్థల బ్యాలెన్స్‌షీట్‌ల ప్రతికూలతల నుంచి మనదేశం బయట పడుతోంది. ఇందువల్ల కార్పొరేట్‌ కంపెనీల పెట్టుబడుల విస్తరణతో పాటు బ్యాంకుల రుణ సామర్థ్యం, రుణ మంజూరుకు ఆసక్తిని పెంచుతోంద’ని వివరించారు. యువ జనాభా పరంగా దేశానికి ఉన్న సానుకూలత వచ్చే 30 ఏళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు.

నైపుణ్యాభివృద్ధి కలిసి వస్తుంది: కృత్రిమ మేధ, బిగ్‌ డేటా లాంటి విభాగాల్లో ప్రభుత్వ- ప్రైవేట్‌ భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం దేశానికి సంపదను సృష్టించే చర్య అని, వినియోగదారు గిరాకీ పెరిగేందుకూ ఇది ఉపకరిస్తుందని అన్నారు. హరిత ఇంధనం దిశగా భారత్‌ అడుగులు వేస్తుండటం కొత్త మార్కెట్ల సృష్టి, గిరాకీకి దోహదం చేస్తుందని వివరించారు. సౌర విద్యుత్, హరిత హైడ్రోజన్, హరిత అమోనియాలకు ప్రాధాన్యం ఇవ్వడం ,యువతకు గణనీయ ఉద్యోగావకాశాలను కల్పిస్తుందని మంత్రి అభిప్రాయపడ్డారు. మంచి మెజార్టీతో భాజపా తిరిగి అధికారంలోకి వస్తుందని, వరుసగా మూడో సారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపడతారని నిర్మలా సీతారామన్‌ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తిరిగి ఏర్పడ్డాక.. పరిశ్రమకు మరింతగా మంచి చేసే నిమిత్తం బడ్జెట్లో చేపట్టాల్సిన చర్యలపై సీఐఐతో సంప్రదింపులు చేస్తామని తెలిపారు. భారత్‌లో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని.. ఈ ప్రభావం ఆర్థిక వ్యవస్థలోని అని రంగాల్లోనూ కనిపిస్తోందని అన్నారు.

తయారీ రంగంపై మరింత దృష్టి: భారత్‌ స్వయం సమృద్ధిని సాధించేందుకు, ప్రపంచ సరఫరా వ్యవస్థలో తన వాటాను పెంచుకునేందుకు తయారీ రంగంపై మరింతగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని నిర్మలా సీతారామన్‌ ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. కొవిడ్‌-19 పరిణామాల తర్వాత చైనా నుంచి తమ కార్యకలాపాలను ఇతర దేశాలకు తరలించాలనే (చైనా ప్లస్‌ వన్‌) వ్యూహాన్ని అంతర్జాతీయ సంస్థలు అమలు చేస్తున్న నేపథ్యంలో, తయారీ రంగ సామర్థ్య విస్తరణను వేగవంతం చేసేందుకు మనదేశానికి ఇప్పటికీ అవకాశాలు ఉన్నాయని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. చైనాపై ఆధారపడటం తగ్గించుకోవాలని, తయారీ కార్యకలాపాలను వర్ధమాన విపణులకు తరలించాలని భావిస్తున్న ఐరోపా, అమెరికాలోని కంపెనీలకు అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానాల జాబితాలో భారత్‌ ముందువరుసలో ఉందని క్యాప్‌జెమిని రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నివేదికను ఉటంకిస్తూ మంత్రి తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని