ప్రమోటర్‌ సంస్థకు రాధిక, ప్రణయ్‌ గుడ్‌బై.. కొనసాగుతున్న NDTV షేర్ల ర్యాలీ

NDTV వ్యవస్థాపకులు ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌ ప్రమోటర్‌ సంస్థ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ కంపెనీ నుంచి వైదొలిగారు.

Published : 30 Nov 2022 14:21 IST

దిల్లీ: న్యూదిల్లీ టీవీ వ్యవస్థాపకులు (NDTV) ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌ ప్రమోటర్‌ సంస్థ అయిన ఆర్‌ఆర్‌పీఆర్‌ (RRPR) హోల్డింగ్‌ కంపెనీ నుంచి వైదొలిగారు. గతంలో ఇచ్చిన రుణాన్ని RRPR ద్వారా వాటాలుగా మార్చుకోవడంతో NDTVలో 29.18శాతం వాటా అదానీ గ్రూప్‌ వశమైంది. ఈ క్రమంలో ప్రమోటర్‌ గ్రూప్‌ నుంచి వారు వైదొలిగినట్లు స్టాక్‌ ఎక్స్ఛేంజీకి NDTV సమాచారమిచ్చింది. అయితే, వారు న్యూస్‌ ఛానల్‌ బోర్డులో మాత్రం కొనసాగనున్నారు. వారిద్దరికి ఇప్పటికీ NDTVలో 32.26 శాతం వాటా ఉంది. ప్రణయ్‌ రాయ్‌ ఎన్డీటీవీ ఛైర్‌పర్సన్‌గానూ,  రాధికారాయ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గానూ ప్రస్తుతం కొనసాగుతున్నారు.

మరోవైపు ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌ కంపెనీకి సుదీప్తా భట్టాచార్య, సంజయ్‌ పుగాలియా, సెంథిల్‌ సిన్నయ్య చెంగల్వారాయన్‌ డైరెక్టర్లుగా నియిమితులైనట్లు ఎన్డీటీవీ స్టాక్‌ ఎక్స్ఛేంజీకి  తెలిపింది. ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్స్‌ను సొంతం చేసుకున్న నేపథ్యంలో వారి పేర్లను అదానీ గ్రూప్‌ గత వారం సూచించింది. మరోవైపు ఓపెన్‌ ఆఫర్‌ పూర్తయితే NDTVలో యాజమాన్య హక్కులు అదానీ సంస్థకు దఖలు పడతాయి. అప్పుడు రాధికా, ప్రణయ్‌ రాయ్‌లను బోర్డు నుంచి వైదొలగమని కోరే అవకాశం ఉంది.

రుణం వాటాలుగా..

NDTV ప్రమోటర్‌ కంపెనీ అయిన RRPR హోల్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు విశ్వప్రదాన్‌ కమర్షియల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (VCPL) రూ.403.85 కోట్ల రుణం ఇచ్చింది. తర్వాతి కాలంలో VCPL యాజమాన్యం చేతులు మారి.. అదానీ గ్రూప్‌నకు చెందిన సంస్థ దాన్ని కొనుగోలు చేసింది. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం.. అప్పును 29.18 శాతం వాటాగా మార్చుకోవడంతో NDTVలో అదానీ గ్రూప్‌ వాటాలు పొందింది. దీనికి అదనంగా 26 శాతం వాటా కొనుగోలు కోసం ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది.

NDTV షేరు ర్యాలీ

స్టాక్‌ మార్కెట్‌లో NDTV షేరు పరుగు కొనసాగుతోంది. వరుసగా ఐదో రోజూ షేరు విలువ ఎగబాకింది. బుధవారం సైతం మరో 5 శాతం ఎగిసి అప్పర్‌ సర్క్యూట్‌ను తాకింది. దీంతో బీఎస్‌ఈలో ఈ ఉదయం ఆ కంపెనీ షేరు రూ.447.70కి చేరింది. గడిచిన ఐదు రోజుల్లోనే 24 శాతం మేర పెరిగింది. మరోవైపు అదానీ ప్రకటించిన ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 5న ముగియనుంది. 1.67 కోట్ల షేర్లను రూ.294 వద్ద కొనుగోలు చేస్తామని ఆ గ్రూప్‌ ప్రకటించగా... 53.27 లక్షల షేర్లను షేర్‌ హోల్డర్లు విక్రయించారు. అయితే, ఓపెన్‌ ఆఫర్‌ ధరకు, ఎన్డీటీవీ ప్రస్తుత షేరు విలువకు అంతరం ఎక్కువగా ఉండడంతో అదానీ గ్రూప్‌నకు షేర్ల విక్రయానికి వాటాదారులు ఎంతమేర ముందుకొస్తారనేది ఆసక్తిగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు