Upasana Bharadwaj: ప్రైవేటు పెట్టుబడులు అక్టోబరు నుంచి పుంజుకుంటాయ్‌!

ప్రైవేటు రంగ పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో అర్ధ భాగం (అక్టోబరు) నుంచి పుంజుకుంటాయని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ముఖ్య ఆర్థిక వేత్త ఉపాసనా భరద్వాజ్‌ వెల్లడించారు.

Published : 22 May 2024 02:04 IST

ఆతిథ్య, పర్యాటకంలోకి అధికంగా వస్తాయ్‌
కోటక్‌ బ్యాంక్‌ ముఖ్య ఆర్థిక వేత్త ఉపాసనా భరద్వాజ్‌ 

దిల్లీ: ప్రైవేటు రంగ పెట్టుబడులు ఈ ఆర్థిక సంవత్సరం (2024-25) రెండో అర్ధ భాగం (అక్టోబరు) నుంచి పుంజుకుంటాయని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ముఖ్య ఆర్థిక వేత్త ఉపాసనా భరద్వాజ్‌ వెల్లడించారు. కొన్నేళ్ల తర్వాత మౌలిక వసతుల రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మూలధన వ్యయాలు పెంచేందుకు ముందుకు వస్తుండటంతో హోటల్, పర్యాటక రంగాల్లోకి ప్రైవేటు పెట్టుబడులు వెల్లువెత్తుతాయని అంచనా వేశారు. ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం మూలధన వ్యయాలు పెంచుతున్న నేపథ్యంలో దేశ వృద్ధి స్థిరంగా కొనసాగే అవకాశం ఉంది. 2020-21లో ప్రభుత్వం రూ.4.39 లక్షల కోట్ల మూలధన వ్యయాలు చేయగా, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.11 లక్షల కోట్లకు పైగా వెచ్చించబోతోంది. అంకెల పరంగా బడ్జెట్‌లో మూలధన కేటాయింపులు భారీగా పెరిగినా, గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 11 శాతమే అధికమైంది. అంతకు ముందు 3 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి సుమారు 35 శాతంగా ఉంది. ప్రభుత్వ రంగ మూలధన వ్యయాలు తగ్గిన సమయంలో, ప్రైవేటు పెట్టుబడులు పుంజుకుంటాయని ఉపాసనా భరద్వాజ్‌ వివరించారు. వచ్చే రెండు త్రైమాసికాల్లో (అక్టోబరు-మార్చి) ఇవి పెరుగుతాయని పేర్కొన్నారు. మౌలిక వసతుల రంగానికి అనుసంధానమైన రంగాల్లోకి తొలుత ప్రైవేటు పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఆ తర్వాత అన్ని విభాగాల్లోకి చేరతాయని వెల్లడించారు. గత కొన్నేళ్లుగా హోటల్, పర్యాటక రంగాలు విస్తరణ దిశగా అడుగులు వేయలేదని, అందుకే తొలుత ఈ రంగాల్లోకి పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని