Cement: కాలుష్య రహితంగా సిమెంట్‌ తయారీ!

కాలుష్యానికి తావు లేకుండా (నెట్‌ జీరో కార్బన్‌) సిమెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని సిమెంటు పరిశ్రమ నిర్దేశించుకోవాలని జేకే సిమెంట్‌ లిమిటెడ్‌ సీఈఓ, గ్రీన్‌ సిమెంటెక్‌ 2024 ఛైర్మన్‌ మాధవ్‌ కృష్ణ సింఘానియా సూచించారు.

Published : 24 May 2024 03:12 IST

‘నెట్‌ జీరో కార్బన్‌’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న పరిశ్రమ
అంతర్జాతీయ ఉత్పత్తిలో మన దేశానికి రెండోస్థానం

ఈనాడు, హైదరాబాద్‌: కాలుష్యానికి తావు లేకుండా (నెట్‌ జీరో కార్బన్‌) సిమెంటు ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని సిమెంటు పరిశ్రమ నిర్దేశించుకోవాలని జేకే సిమెంట్‌ లిమిటెడ్‌ సీఈఓ, గ్రీన్‌ సిమెంటెక్‌ 2024 ఛైర్మన్‌ మాధవ్‌ కృష్ణ సింఘానియా సూచించారు. వాతావరణ మార్పులపై పోరాటానికి తమ వంతు కృషి ఈ విధంగా చేయాలని, ఇందువల్ల సిమెంటు కంపెనీలకూ ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్‌లో గురువారం సీఐఐ గ్రీన్‌ సిమెంటెక్‌ 2024 ప్రారంభ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘ప్రపంచ వ్యాప్తంగా సిమెంటు ఉత్పత్తిలో మనదేశం రెండో స్థానంలో ఉంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, స్థిరాస్తి నిర్మాణాల నుంచి లభించే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని దేశీయ సిమెంటు పరిశ్రమ 2026 వరకూ ఏటా 7% వృద్ధి సాధిస్తుందన్నది అంచనా.  తగిన జాగ్రత్తలు తీసుకోని పక్షంలో సిమెంటు ఉత్పత్తి వల్ల ఎంతో కాలుష్యం వెలువడి, పర్యావరణానికి నష్టం చేకూరుతుంది. అందుకే కాలుష్యానికి తావులేని రీతిలో సిమెంటు ఉత్పత్తి చేయడానికి అనువైన వ్యూహాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడానికి సీఐఐ గ్రీన్‌ సిమెంటెక్‌ 2024 కృషి చేస్తోంద’ని మాధవ్‌ కృష్ణ సింఘానియా వివరించారు.

పరిశోధనలే కీలకం: కాలుష్య రహిత లక్ష్యాలను చేరుకోవడం ద్వారా, పర్యావరణ పరిరక్షణలో దేశానికి అండగా నిలవాలని సిమెంటు పరిశ్రమ భావిస్తున్నట్లు శ్రీ సిమెంట్‌ లిమిటెడ్‌ ఎండీ, సిమెంటు ఉత్పత్తిదార్ల సంఘం అధ్యక్షుడు నీరజ్‌ అఖౌరీ పేర్కొన్నారు. పరిశోధన- అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా పర్యావరణ లక్ష్యాలను చేరొచ్చని అల్ట్రాటెక్‌ సిమెంట్‌ చీఫ్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌ రాజు గోయల్‌ సూచించారు. ఫ్లైయాష్, స్లాగ్‌ సిమెంట్‌ వినియోగాన్ని ప్రోత్సహించడంతో పాటు, సిమెంటు రవాణాలో విద్యుత్తు వాహనాలను వినియోగించాలని ఇండియన్‌ గ్రీన్‌ బిల్డింగ్‌ కౌన్సిల్‌ (ఐజీబీసీ) ఉపాధ్యక్షుడు శేఖర్‌ రెడ్డి కోరారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సిమెంటు ఉత్పత్తి, రవాణా, పంపిణీ విభాగాల్లో అనుసరించాల్సిన కొత్త విధానాలు, పర్యావరణానికి నష్టం చేసే విధానాలను తిరస్కరించడం, వనరులను సమర్థంగా వినియోగించుకోవటం.. వంటి అంశాలపై చర్చిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు