Passenger Vehicles: 2024-25లో పీవీ విక్రయాల వృద్ధి 5 శాతానికి పరిమితం: టాటా మోటార్స్‌

Passenger Vehicles: వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రయాణికుల వాహన విక్రయాల వృద్ధి నెమ్మదించినప్పటికీ.. విద్యుత్‌ వాహన అమ్మకాల జోరు మాత్రం కొనసాగుతుందని టాటా మోటార్స్ తెలిపింది.

Published : 25 Feb 2024 12:47 IST

దిల్లీ: దేశీయ ప్రయాణికుల వాహన పరిశ్రమ వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐదు శాతం కంటే తక్కువకే పరిమితమవుతుందని టాటా మోటార్స్ (Tata Motors) అంచనా వేసింది. విద్యుత్‌ వాహన (Electric Vehicles- EV) విక్రయాల జోరు మాత్రం కొనసాగుతుందని కంపెనీ డైరెక్టర్ శైలేశ్‌ చంద్ర తెలిపారు. దేశవ్యాప్తంగా ఛార్జింగ్‌ వసతులు ఇంకా పుంజుకోవాల్సి ఉన్నప్పటికీ.. ఈవీ అమ్మకాలు మాత్రం పెరుగుతాయన్నారు.

‘‘2022-23లో ప్రయాణికుల వాహన విక్రయాల్లో 25 శాతం వృద్ధి నమోదైంది. 2023-24లో అది ఎనిమిది శాతంగా ఉంది. 2024-25లో వృద్ధి ఐదు శాతం కంటే దిగువకే పరిమితమవుతుంది. ఈవీ పరిశ్రమ విషయానికి వస్తే విక్రయాలు పుంజుకుంటున్న స్థాయిలో ఛార్జింగ్‌ మౌలిక వసతుల అభివృద్ధి జరగడం లేదు. ప్రస్తుతానికి ఇది పెద్ద సవాల్‌గా మారింది. గత త్రైమాసికంలో కమొడిటీ ధరలు స్థిరంగా ఉన్నాయి. కానీ, రాబోయే రోజుల్లో కొన్నింటి ధరలు పెరిగే అవకాశం ఉంది’’ అని చంద్ర తెలిపారు.

దేశంలో ఈవీ ఛార్జింగ్‌ వసతుల విస్తరణ కోసం టాటా మోటార్స్‌ (Tata Motors) ఇతర కంపెనీల భాగస్వామ్యంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉందని చంద్ర తెలిపారు. ఈ మేరకు చమురు విక్రయ సంస్థలతో పాటు ఛార్జింగ్‌ పాయింట్‌ ఆపరేటర్లతోనూ చర్చలు జరుపుతున్నామన్నారు. మరోవైపు తమ కంపెనీ నుంచి వచ్చే ఈవీల కోసం ప్రత్యేక విక్రయ కేంద్రాలను విస్తరిస్తామని తెలిపారు. ప్రస్తుతం గురుగ్రామ్‌లో రెండు ఔట్‌లెట్లు ఉన్నట్లు వెల్లడించారు. వచ్చే 18 నెలల్లో అధిక విక్రయాలు జరిగే అన్ని నగరాలకు విస్తరిస్తామన్నారు.

పంచ్‌ ఈవీతో విద్యుత్‌ వాహన విభాగంలోకి ప్రవేశించిన టాటా మోటార్స్ ప్రస్తుతం నాలుగు మోడళ్లను విక్రయిస్తోంది. ఈ ఏడాది కర్వ్‌, హ్యారియర్‌ ఈవీలను సైతం తీసుకొచ్చే యోచనలో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని