Range Rover: రేంజ్‌ రోవర్‌ తయారీ దేశీయంగా

టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ తన రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ కార్లను భారత్‌లోనే తయారు చేయనుంది. సంస్థ 54 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో, బ్రిటన్‌ వెలుపల తొలిసారిగా ఈ మోడళ్లను తయారు చేయనుండడం విశేషం.

Updated : 25 May 2024 03:38 IST

ధరలు 22% తగ్గొచ్చు

ముంబయి: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ తన రేంజ్‌ రోవర్, రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ కార్లను భారత్‌లోనే తయారు చేయనుంది. సంస్థ 54 ఏళ్ల సుదీర్ఘ చరిత్రలో, బ్రిటన్‌ వెలుపల తొలిసారిగా ఈ మోడళ్లను తయారు చేయనుండడం విశేషం. ఇప్పటిదాకా ఈ రెండు మోడళ్లు బ్రిటన్‌లోని సొలిహల్‌ ప్లాంటులోనే తయారవుతున్నాయి. అక్కడి నుంచే భారత్‌ సహా 121 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. మనదేశంలోనూ ఈ కార్లకు గిరాకీ పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదార్లకు కాస్త తక్కువ ధరలో అందుబాటులోకి తీసుకురావడం కోసం, ఇక్కడ తయారీకి ఉపక్రమించింది. దేశీయంగా విడిభాగాలు సమీకరిస్తున్నందున, స్థానికంగా ఉత్పత్తి అవుతున్న కారణంగా ఈ మోడళ్ల ధరలు 18-22% వరకు తగ్గే అవకాశం ఉంది. 15 ఏళ్ల కిందట టాటా గ్రూప్‌లోకి జేఎల్‌ఆర్‌ను రతన్‌ టాటా తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

‘రేంజ్‌ రోవర్‌ భారత్‌లో తయారవుతుందన్న మాటే అద్భుతంగా ఉంది. ఇవి నాకు సంబరపడే క్షణాలు’ అని టాటా గ్రూప్‌ ఛైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. భవిష్యత్తులో విక్రయాలను కంపెనీ కచ్చితంగా పెంచుకోగలదనే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో జేఎల్‌ఆర్‌ ఇండియా 81% వృద్ధితో 4,436 వాహనాలను విక్రయించింది.

ధర ఎంత తగ్గుతుందంటే: స్థానిక తయారీ కారణంగా, ఆగస్టు నుంచి డెలివరీలు ప్రారంభమయ్యే రేంజ్‌ రోవర్‌ స్పోర్ట్‌ ధర రూ.1.9 కోట్ల నుంచి రూ.1.4 కోట్లకు తగ్గుతుందని జేఎల్‌ఆర్‌ ఇండియా ఎండీ రాజన్‌ అంబా తెలిపారు. అతి  త్వరలోనే మార్కెట్లో అందుబాటులోకి వచ్చే రేంజ్‌ రోవర్‌ ధర రూ.3.3 కోట్ల నుంచి రూ.2.6 కోట్లకు పరిమితం కానుందని తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని