Vijaypat Singhania: ఆ ఫొటో వెనుక ఉద్దేశాలు వేరు.. గౌతమ్‌ సింఘానియా పోస్ట్‌పై తండ్రి

Vijaypat Singhania: రేమండ్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ సింఘానియా ఇటీవల తన తండ్రి విజయ్‌పత్‌ సింఘానియాతో కలిసి ఉన్న ఓ ఫొటోను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు. దీనిపై విజయ్‌పత్‌ స్పందించారు. తన కుమారుడితో ఎప్పటికీ కలిసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

Updated : 26 Mar 2024 14:12 IST

దిల్లీ: ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ రేమండ్‌ (Raymond Group) ఛైర్మన్‌ గౌతమ్‌ సింఘానియా, ఆయన తండ్రి విజయ్‌పత్‌ సింఘానియా మధ్య విభేదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తండ్రిని ఇంటికి ఆహ్వానించి.. ఆశీర్వాదం తీసుకున్నట్లు ఇటీవల గౌతమ్‌ (Gautam Singhania) ఇన్‌స్టాలో ఓ ఫొటోను పోస్ట్‌ చేశారు. ఇద్దరూ కలిసున్నట్లు దీనిలో ఉంది. ఆయన ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షిస్తున్నట్లు రాసుకొచ్చారు.

విజయ్‌పత్‌ తాజాగా దీనిపై స్పందించారు. కుమారుడు గౌతమ్‌తో ఎప్పటికీ సయోధ్య సాధ్యంకాదని ఓ ప్రముఖ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ అన్నారు. మార్చి 20న సహాయకుల ద్వారా గౌతమ్‌ తనని ఇంటికి ఆహ్వానించారని చెప్పారు. మొదట్లో నిరాకరించినప్పటికీ.. వీడియో కాల్‌లో ప్రాధేపడటంతో ఇష్టం లేకున్నా వెళ్లానని చెప్పారు. కాసేపటికే నేను, గౌతమ్‌ కలిసిపోయినట్లు ఇంటర్నెట్లో ఫొటోలు రావడం గమనించానని చెప్పారు. దాంట్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు. ఆయన ఆహ్వానించింది విభేదాల పరిష్కారానికో.. లేక.. కాఫీకో కాదని.. దాని వెనుక ఇంకేదో ఉద్దేశం ఉందన్నారు. ‘‘నేను జేకే హౌస్‌లోకి ప్రవేశించడం పదేళ్లలో ఇదే తొలిసారి. మళ్లీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు’’ అని విజయ్‌పత్‌ (Vijaypat Singhania) అన్నారు.

ట్రంప్‌నకు మళ్లీమళ్లీ రాని రోజు..ప్రపంచ కుబేరుల జాబితాలో స్థానం..!

2015లో రేమండ్‌ ఛైర్మన్‌ పదవి నుంచి విజయ్‌పత్‌ వైదొలిగారు. కుమారుడు గౌతమ్‌కు బాధ్యతలు అప్పగించారు. నాటి నుంచి ఇరువురి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. 2018లో సంస్థ గౌరవ ఛైర్మన్‌ పదవి నుంచి కూడా విజయ్‌పత్‌ను పక్కన పెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని