Credit Card: రూపే, వీసా, మాస్టర్‌.. మీకు నచ్చిన క్రెడిట్‌ కార్డు ఎంచుకోవచ్చు!

Credit Card: క్రెడిట్‌ కార్డు ఎంపికలో జారీ సంస్థలు తమ వినియోగదారులకు విస్తృత ఆప్షన్లు ఇచ్చే దిశగా ఆర్‌బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది.

Published : 06 Mar 2024 13:21 IST

Credit Card | క్రెడిట్‌ కార్డులను ఎంపిక చేసుకునే విషయంలో వినియోగదారులకు మరిన్ని ఆప్షన్స్‌ ఉండేలా ఆర్‌బీఐ కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. ప్రస్తుతం అనుమతి ఉన్న కార్డు నెట్‌వర్క్‌లు బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలతో కలిసి క్రెడిట్‌ కార్డులను (Credit Card) జారీ చేస్తున్నాయి. అయితే, ఏ నెట్‌వర్క్‌ కార్డును ఇవ్వాలనేది కార్డు జారీ చేసే సంస్థలే నిర్ణయిస్తున్నాయి. ఇది ఆయా నెట్‌వర్క్‌లతో వాటికి ఉన్న ఒప్పందాలపై ఆధారపడి ఉంటుంది.

దీన్ని తాజాగా ఆర్‌బీఐ (RBI) సమీక్షించింది. జారీ సంస్థలు, నెట్‌వర్క్‌ల మధ్య ఉన్న ఒప్పందాల వల్ల కార్డు ఎంపికలో వినియోగదారులకు పరిమిత ఆప్షన్లు ఉన్నాయని గుర్తించింది. ఈ పరిస్థితిని మార్చేందుకు పేమెంట్‌ అండ్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ చట్టం 2007 కింద దఖలుపడిన అధికారాలను ఉపయోగించి మార్గదర్శకాలను జారీ చేసింది. వాటి ప్రకారం..

  • ఇతర నెట్‌వర్క్‌ల సేవలను పొందకుండా పరిమితులు విధించే కార్డు నెట్‌వర్క్‌లతో జారీ సంస్థలు ఒప్పందాలు చేసుకోవద్దు.
  • నచ్చిన నెట్‌వర్క్‌ నుంచి కార్డును ఎంపిక చేసుకునే ఆప్షన్‌ను జారీ సంస్థలు వినియోగదారులకు ఇవ్వాలి.
  • ఇప్పటికే కార్డు ఉన్నవారికి రెన్యువల్‌ సమయంలో నచ్చిన నెట్‌వర్క్‌కు మారే అవకాశాన్ని కల్పించాలి.

అనుమతి ఉన్న కార్డు నెట్‌వర్క్‌ల జాబితాను ఆర్‌బీఐ (RBI) తన మార్గదర్శకాల్లో పేర్కొంది. అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌ బ్యాంకింగ్‌ కార్పొరేషన్‌, డైనర్స్‌ క్లబ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌, మాస్టర్‌ కార్డ్‌ ఏషియా/పసిఫిక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా-రూపే, వీసా వరల్డ్‌వైడ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అందులో ఉన్నాయి. నెట్‌వర్క్‌లు, జారీ సంస్థలు ఇప్పటికే ఉన్న ఒప్పందాలను రెన్యువల్‌ చేసే సమయంలో ఈ నిబంధనలను కచ్చితంగా అమలయ్యేలా సవరణలు చేయాలని ఆదేశించింది. అయితే, పది లక్షల కంటే తక్కువ యాక్టివ్‌ కార్డులు ఉన్న జారీదారులకు మాత్రం ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది. అలాగే సొంత నెట్‌వర్క్‌ ద్వారా కార్డు జారీ చేస్తున్న సంస్థలకు కూడా మినహాయింపునిచ్చింది. ఈ మార్గదర్శకాలను 2024 మార్చి 6 నుంచి ఆరు నెలల్లో అమలు చేయాలని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని