HDFC Bank: ఇతర బ్యాంకుల్లో వాటాల కొనుగోలుకు హెచ్‌డీఎఫ్‌సీకి ఆర్‌బీఐ ఆమోదం

HDFC Bank: ఇండస్‌ఇండ్‌ సహా మరికొన్ని బ్యాంకుల్లో వాటాలు కొనుగోలు చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీకి ఆర్‌బీఐ నుంచి ఆమోదం లభించింది. దీనికి నిబంధనల ప్రకారం ఇతర నియంత్రణ సంస్థల అనుమతులు సైతం లభించాల్సి ఉంది.

Updated : 06 Feb 2024 11:35 IST

ముంబయి: ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌లో 9.50 శాతం వాటా కొనుగోలు చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు (HDFC Bank) ఆర్‌బీఐ ఆమోదం తెలిపింది. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. లేదంటే ఆమోదం రద్దవుతుందని స్పష్టం చేసింది. ఈ ప్రక్రియకు బ్యాంకింగ్‌ నియంత్రణ చట్టం, సెబీ, ఫెమా అనుమతులు ఇంకా లభించాల్సి ఉంది. 

ఇండస్‌ఇండ్‌లో హెచ్‌డీఎఫ్‌సీకి (HDFC Bank) ఏ సమయంలోనూ 9.50 శాతం పెయిడ్‌-అప్‌ షేర్‌ క్యాపిటల్‌ లేదా ఓటింగ్‌ హక్కులకు సమానమైన వాటా మించి ఉండకూడదని ఆర్‌బీఐ (RBI) షరతు విధించింది. ఒకవేళ సంస్థ సమగ్ర వాటా ఐదు శాతం దిగువకు చేరితే దాన్ని మళ్లీ పెంచుకోవడానికీ ముందస్తు అనుమతిని తప్పనిసరి చేసింది. మరోవైపు తమ సంస్థలోనూ 9.5 శాతం వాటా కొనుగోలు చేసేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు ఆర్‌బీఐ అనుమతి ఇచ్చినట్లు యెస్‌ బ్యాంక్‌ వెల్లడించింది. ఇదే తరహాలో యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, సూర్యోదయ స్మాల్ ఫైనాన్స్‌ బ్యాంక్‌, బంధన్ బ్యాంకులోనూ వాటాల కొనుగోళ్లకు హెచ్‌డీఎఫ్‌సీకి ఆర్‌బీఐ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది.

ఇండస్‌ఇండ్ బ్యాంక్‌లో ప్రమోటర్లు ఇండస్ఇండ్ ఇంటర్నేషనల్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌, ఇండస్ఇండ్ లిమిటెడ్‌కు కలిపి 16.45 శాతం, మ్యూచువల్‌ ఫండ్లకు 15.63 శాతం వాటాలున్నాయి. ఎల్‌ఐసీ సహా ఇతర బీమా సంస్థలకు 7.04 శాతం, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు 38.24 శాతం వాటాలు ఉన్నట్లు సమాచారం. మరోవైపు యెస్‌ బ్యాంక్‌లో 100 శాతం షేర్లు పబ్లిక్‌ చేతిలోనే ఉన్నాయి. దీంట్లో ఎల్‌ఐసీ 4.34 శాతం, ఎస్‌బీఐ నేతృత్వంలోని కన్సార్షియానికి (యాక్సిస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, కోటక్‌ బ్యాంక్‌లు) 37.23 శాతం వాటాలున్నాయి. అలాగే ఐసీఐసీఐ బ్యాంక్‌లో 3.43 శాతం, యాక్సిస్‌ బ్యాంక్‌లో 2.57 శాతం వాటాలు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ చేతిలో ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని