Paytm: ఖాతాల్లో ఉన్న డబ్బుపై ఎలాంటి ప్రభావం ఉండదు: పేటీఎం

Paytm: ఆర్‌బీఐ తాజా ఆంక్షల వల్ల పొదుపు ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌, ఎన్‌సీఎంసీ ఖాతాల్లో ఇప్పటికే ఉన్న డిపాజిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని OCL స్పష్టం చేసింది.

Updated : 01 Feb 2024 14:34 IST

ముంబయి: వినియోగదారుల నుంచి డిపాజిట్లు స్వీకరించకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) విధించిన ఆంక్షల వల్ల తమ వార్షిక కార్యకలాపాల లాభంపై రూ.300-500 కోట్ల మేర ప్రభావం ఉంటుందని ‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)’ గురువారం వెల్లడించింది.. అయినప్పటికీ రానున్న కాలంలో కంపెనీ లాభదాయకతను మెరుగుపరిచేందుకు చేస్తున్న కృషి కొనసాగుతుందని తెలిపింది.

తాజా వ్యవహారంపై పేటీఎం బ్రాండ్‌ మాతృసంస్థ వన్‌97 కమ్యూనికేషన్స్‌ (OCL) వివరణ ఇచ్చింది. ‘‘ఆర్థిక సేవల సంస్థగా OCL కస్టమర్లకు వివిధ చెల్లింపుల సాధనాలను అందిస్తోంది. అందుకోసం పేటీఎం పేమెంట్స్ సహా పలు బ్యాంకులతో కలిసి పనిచేస్తోంది. తాజా ఆంక్షల నేపథ్యంలో మా పథకాలు, ప్లాన్లనన్నింటినీ ఇతర భాగస్వామ్య బ్యాంకులకు బదిలీ చేస్తాం. ఇకపై PPBLతో కాకుండా కేవలం ఇతర బ్యాంకులతో మాత్రమే పని చేస్తాం’’ అని తెలిపింది. ఆర్‌బీఐ ఆదేశాలను అమలు చేసేందుకు పీపీబీఎల్‌ అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని వెల్లడించింది.

ఆర్‌బీఐ (RBI) తాజా ఆంక్షల వల్ల పొదుపు ఖాతాలు, వ్యాలెట్లు, ఫాస్టాగ్‌, ఎన్‌సీఎంసీ ఖాతాల్లో ఉన్న డిపాజిట్లపై ఎలాంటి ప్రభావం ఉండదని OCL స్పష్టం చేసింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న సొమ్మును నిస్సంకోచంగా వినియోగించుకోవచ్చని తెలిపింది. ఆన్‌లైన్‌లో వ్యాపారులకు సేవలందించే పేటీఎం పేమెంట్‌ గేట్‌వే బిజినెస్‌ ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతుందని వెల్లడించింది. పేటీఎం క్యూఆర్‌, పేటీఎం సౌండ్‌బాక్స్‌, పేటీఎం కార్డ్‌ మెషీన్‌ కార్యకలాపాలు సైతం యథావిధిగా కొనసాగుతాయని పేర్కొంది. రుణ మంజూరు, బీమా పంపిణీ, ఈక్విటీ బ్రోకింగ్‌ సేవలతో పీపీబీఎల్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది.

‘పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌’ 2024 ఫిబ్రవరి 29 తరవాత నుంచి డిపాజిట్లను స్వీకరించకూడదని ఆర్‌బీఐ ఆదేశించిన విషయం తెలిసిందే. వినియోగదార్ల ఖాతాలు, ప్రీ పెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌లు, వాలెట్‌లు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్‌ కామన్‌ మొబిలిటీ (ఎన్‌సీఎంసీ) కార్డులు తదితరాల్లో క్రెడిట్‌ లావాదేవీలు లేదా టాప్‌అప్‌లు కూడా అప్పటినుంచి చేయకూడదని స్పష్టం చేసింది. అయితే వినియోగదారులకు వడ్డీ, క్యాష్‌బ్యాక్‌, రిఫండ్‌ల జమ లాంటివి ఏ సమయంలోనైనా సంస్థ చేయొచ్చని తెలిపింది. వినియోగదారులు తమ పొదుపు బ్యాంకు ఖాతా, కరెంటు ఖాతా, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌, ఫాస్ట్‌ట్యాగ్‌, ఎన్‌సీఎంసీ కార్డుల్లో ఉన్న డబ్బుల నిల్వను ఉపసంహరించుకునేందుకు, వాడుకునేందుకు ఎటువంటి ఆంక్షలు లేకుండా అనుమతులు ఇస్తున్నామని పేర్కొంది. బయటి ఆడిటర్లు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ కార్యకలాపాలపై పూర్తి స్థాయిలో ఆడిట్‌ చేసి ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. సంస్థ కొన్ని నిబంధనలు ఉల్లంఘించిందని, పర్యవేక్షణ లోపాలున్నాయని ఆడిట్‌లో తేలినందునే.. మరింతగా పర్యవేక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తించామని ఆర్‌బీఐ వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని