Paytm: పేటీఎంపై ఆంక్షలు.. ‘రివ్యూ’కు ఛాన్స్‌ లేదన్న ఆర్‌బీఐ..!

Paytm: పేటీఎంపై విధించిన ఆంక్షలను సమీక్షించాలని తాము అనుకోవడం లేదని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ స్పష్టం చేశారు.

Published : 12 Feb 2024 17:42 IST

దిల్లీ: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (PPBL)పై ఇటీవల రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. దీనిపై ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సోమవారం స్పందించారు. పేటీఎం (Paytm)పై చర్యలను తాము సమీక్షించాలనుకోవడం లేదని తేల్చిచెప్పారు.

‘‘సమగ్ర అంచనా తర్వాతే ఆర్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. ఫిన్‌టెక్‌ రంగానికి మేం పూర్తి మద్దతు ఇస్తాం. ఆ సమయంలో ఆర్థిక స్థిరత్వం, కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడం వంటి వాటికి మేం కట్టుబడి ఉంటాం. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌పై విధించిన ఆంక్షలను సమీక్షించే అవకాశం దాదాపు లేనట్లే’’ అని దాస్‌ (Shaktikanta Das) వెల్లడించారు. మరోవైపు, పేటీఎం వ్యవహారంపై కేంద్ర బ్యాంక్‌ త్వరలోనే ప్రశ్నావళిని (Frequently Asked Questions) విడుదల చేయనున్నట్లు సమాచారం.

పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ రాజీనామా

పేటీఎం (Paytm)కు చెందిన పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఇటీవల ఆర్‌బీఐ షాకిచ్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 29 తర్వాత ఏ కస్టమర్‌, ప్రీపెయిడ్‌ ఇన్‌స్ట్రుమెంట్‌, వ్యాలెట్‌, ఫాస్టాగ్‌లలో డిపాజిట్లు, టాప్‌-అప్‌లు చేపట్టకూడదని ఆదేశించింది. సమగ్ర సిస్టమ్‌ ఆడిట్‌, బయటి ఆడిటర్ల నివేదికలను అనుసరించి ఈ చర్యలు తీసుకుంది. బ్యాంక్‌లో నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు గుర్తించామని ఆర్‌బీఐ పేర్కొంది. మరోవైపు, పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)పై విధించిన ఆంక్షలకు సంబంధించిన నివేదికను ఇవ్వాల్సిందిగా ఆర్‌బీఐను ఈడీ, ఫైనాన్షియల్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ (ఎఫ్‌ఐయూ)లు కోరాయి. దీంతో ఆంక్షల నుంచి బయటపడేందుకు పేటీఎం మార్గాలను అన్వేషిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని