Home Loan: అప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా? పెరిగిన EMI ఇక చెల్లించాల్సిందేనా?

ఆర్‌బీఐ రెపో రేటు పెంపుతో మరోసారి గృహ రుణాలు (Home loans) ప్రియం కానున్నాయి. అయితే, మునుపటిలా కాలవ్యవధిని కాకుండా ఈఎంఐ మొత్తాన్ని పెంచేందుకు బ్యాంకులు మొగ్గు చూపే అవకాశం ఉంది.

Updated : 07 Dec 2022 15:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ద్రవ్యోల్బణాన్ని అదుపులోకి తెచ్చేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరోసారి రెపోరేటును (Repo rate) 35 బేసిస్‌ పాయింట్లు పెంచింది. ఈ ఏడాది మే నెలలో 40 బేసిస్‌ పాయింట్లతో పెంపును మొదలు పెట్టిన ఆర్‌బీఐ.. విడతల వారీగా 2.25 శాతం మేర వడ్డీని పెంచింది. అక్టోబర్‌ వరకు పెంచిన 190 బేసిస్‌ పాయింట్ల వడ్డీని ఇప్పటికే రుణ సంస్థలకు రుణ గ్రహీతలకు బదిలీ చేశాయి. తాజా పెంపు నేపథ్యంలో వడ్డీని మరోసారి సవరించనున్నాయి. ఆర్‌బీఐ తాజా నిర్ణయంతో ఇప్పటికే గృహ (Home loan), వాహన రుణాలు (Auto loan) తీసుకున్న వారిపై మరోసారి వడ్డీ భారం పడనుంది. కొత్తగా తీసుకోవాలనుకునే వారూ రుణాలు తీసుకోవాలంటే వెనకడుగు వేసే పరిస్థితి నెలకొంది.

ఈఎంఐ ఎంత పెరిగింది?

కరోనా తర్వాత ఎన్నడూ లేని స్థాయిలో గృహ రుణాలు (Home loan) చౌకగా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఓ దశలో 6.50 శాతానికే గృహ రుణం లభించింది. చాలా వరకు బ్యాంకులు, గృహ రుణ సంస్థలు పోటీపడి మరీ రుణాలు ఇచ్చాయి. ప్రాసెసింగ్‌ ఫీజు రద్దు, కొన్ని ఈఎంఐలపై (EMI) రాయితీనీ అందించాయి. కట్‌ చేస్తే  అప్పుడు తక్కువకే రుణాలు తీసుకున్న వారికి ఇప్పుడు గృహ రుణాలు భారమై కూర్చున్నాయి.

ఉదాహరణకు 2022 ఏప్రిల్‌లో ఒక వ్యక్తి 30 ఏళ్ల కాలానికి రూ.30 లక్షలు రుణం తీసుకున్నాడనుకుందాం. అప్పట్లో 7 శాతం వడ్డీ అనుకుంటే ఈఎంఐ రూ.19,954 వద్ద ఉండేది. తాజాగా ఆర్‌బీఐ పెరిగిన వడ్డీ రేటును బ్యాంకులు వినియోగదారులకు బదిలీ చేస్తే వడ్డీ 9.25 శాతానికి చేరుతుంది. అప్పుడు ఈఎంఐ రూ.24,680 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక్కో నెల ఈఎంఐ రూ.4600 మేర పెరిగిందన్నమాట!

పెరిగిన ఈఎంఐ చెల్లించాల్సిందేనా?

ఆర్‌బీఐ రెపో రేటును పెంచిన ప్రతిసారీ గృహ రుణాలపై వడ్డీని బ్యాంకులు పెంచుతూ వచ్చాయి. అయితే, వినియోగదారులపై ఆ భారం నేరుగా పడలేదు. కారణం.. బ్యాంకులు ఈఎంఐ మొత్తాన్ని పెంచకుండా కాలవ్యవధిని పెంచుకుంటూ పోవడమే. అంటే ఈఎంఐలు చెల్లించాల్సిన గడువు పెరుగుతూ వచ్చింది. సాధారణంగా 20, 25, 30 ఏళ్ల దీర్ఘకాలానికి గృహ రుణం తీసుకుని ఉంటారు. ఇప్పటి వరకు వడ్డీ పెరిగినప్పుడల్లా కాలవ్యవధిని పెంచిన బ్యాంకులు.. ఇకపై రిస్క్‌ తీసుకోకపోవచ్చని తెలుస్తోంది. రుణం మొత్తం పూర్తయ్యేనాటికి రుణ గ్రహీత వయసు 60-65 ఏళ్లు ఉండేలా బ్యాంకులు చూసుకుంటాయి. ఈ కారణంతోనే తాజా వడ్డీ రేటు పెంపు వల్ల మరోసారి కాలవ్యవధిని పెంచేందుకు అవకాశం ఉండకపోవచ్చని చెబుతున్నారు. ఈసారి పెరిగిన మొత్తాన్ని ఈఎంఐ మొత్తం పెంచేందుకు బ్యాంకులు మొగ్గు చూపొచ్చని అంటున్నారు. 

ఇప్పుడేం చేయాలి..?

  • వడ్డీ పెరిగినప్పుడల్లా అసలులో కొంత మొత్తం చెల్లిస్తూ ఉండాలి. ముఖ్యంగా బోనస్‌లాంటివి వచ్చినప్పుడు, ఇతర అనుకోని ఆదాయాలు లభించినప్పుడు వాటిని ఇంటి అప్పు తీర్చేందుకు వాడుకోవచ్చు.
  • తక్కువ వడ్డీకి ఉన్న డిపాజిట్లను గృహ రుణాల చెల్లింపులకు ఉపయోగించడం మంచిది.
  • వడ్డీ రేట్లు పెరుగుతున్న దశలో ఖర్చులను వీలైనంత తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. రూ.100 మిగిలినా దాన్ని అప్పు చెల్లించేందుకు వినియోగించేలా ఏర్పాటు ఉండాలి.
  • కనీసం 3-6 నెలల ఖర్చులు, ఈఎంఐలకు సరిపడే మొత్తాన్ని అత్యవసర నిధిగా అందుబాటులో ఉంచుకోండి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని