Paytm Payments Bank: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు షాక్‌.. ఆర్‌బీఐ భారీ జరిమానా

RBI imposes penalty on Paytm Payments Bank: నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు ఆర్‌బీఐ గట్టి షాకిచ్చింది. ఏకంగా రూ.5 కోట్లు పెనాల్టీ వడ్డించింది.

Published : 12 Oct 2023 19:40 IST

Paytm Payments Bank | ముంబయి: పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు (Paytm Payments Bank) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) షాకిచ్చింది. కేవైసీ సహా కొన్ని నిబంధనలు పాటించడంలో విఫలమైనందుకు రూ.5.39 కోట్లు జరిమానా విధించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. పేమెంట్స్‌ బ్యాంక్స్‌ లైసెన్సింగ్‌కు సంబంధించి ఆర్‌బీఐ మార్గదర్శకాలు, బ్యాంకుల సైబర్‌ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌ అప్లికేషన్‌ భద్రతకు నిర్దేశించిన నిబంధనలను పాటించడంలో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ విఫలమైనట్లు తాము గుర్తించామని ఆర్‌బీఐ తెలిపింది.

KYC/AML (యాంటీ మనీ లాండరింగ్) కోణంలో బ్యాంక్‌లో ప్రత్యేక పరిశీలన జరిపామని, ఆర్‌బీఐ గుర్తించిన ఆడిటర్లతో బ్యాంక్‌లో సమగ్ర సిస్టమ్ ఆడిట్ నిర్వహించామని ఆర్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. ఈ క్రమంలోనే పేఔట్‌ సర్వీసుల (వ్యాపారులకు అందించే సర్వీసు) సంబంధించి సంస్థ యజమానులను గుర్తించడంలో పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ విఫలమైనట్లు తేలిందని ఆర్‌బీఐ పేర్కొంది. పేఔట్‌ లావాదేవీలు, ఆయా సంస్థల రిస్క్‌ ప్రొఫైలింగ్‌ను మానిటర్‌ చేయడంలోనూ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ విఫలమైటనట్లు గుర్తించింది. పేఅవుట్ సేవలు పొందుతున్న నిర్దిష్ట కస్టమర్ల అడ్వాన్స్‌ ఖాతాల్లో ఎండ్ ఆఫ్ ది డే బ్యాలెన్స్‌కు సంబంధించి నిర్దేశించిన పరిమితినీ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌ ఉల్లంఘించిందని ఆర్‌బీఐ తెలిపింది.

క్రోమ్‌ యూజర్లకు CERT-In అలర్ట్‌.. వెంటనే అప్‌డేట్‌ చేసుకోండి..!

పలు ఉల్లంఘనలు గుర్తించిన అనంతరం ఎందుకు పెనాల్టీ విధించకూడదో పేర్కొంటూ పేటీఎం పేమెంట్స్‌ బ్యాంక్‌కు షోకాజ్‌ నోటీసు జారీ చేసినట్లు ఆర్‌బీఐ తెలిపింది. దీనిపై బ్యాంక్‌ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంతోపాటు వ్యక్తిగత విచారణలో ఇచ్చిన సమాధానం ఆధారంగా ఈ పెనాల్టీ విధించినట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ పెనాల్టీ కేవలం నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినది మాత్రమేనని, కస్టమర్ల లావాదేవీలకు ఎలాంటి సంబంధం లేదని ఆర్‌బీఐ పేర్కొంది. పేటీఎంతో పాటు పుణె వేదికగా పనిచేస్తున్న అన్నాసాహెబ్‌ మగర్‌ సహకారి బ్యాంక్‌కు సైతం రూ.4 లక్షలు జరిమానా విధించినట్లు ఆర్‌బీఐ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని