Repo rate: కీలక వడ్డీ రేట్లు మళ్లీ యథాతథం

Repo rate: ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.

Updated : 08 Feb 2024 14:05 IST

Repo rate | ముంబయి: కీలక వడ్డీరేట్లను ఆర్‌బీఐ (RBI) యథాతథంగా ఉంచింది. అంతా ఊహించినట్లుగానే రెపోరేటును (Repo Rate) 6.5 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. మంగళవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి విధాన సమీక్ష నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ గురువారం వెల్లడించారు.

భారత వృద్ధిరేటు చాలా మంది విశ్లేషకుల అంచనాలను మించి నమోదవుతోందని దాస్‌ తెలిపారు. దేశీయంగా ఆర్థిక కార్యకలాపాలు బలంగా ఉన్నాయన్నారు. ఆహార ధరల్లో అనిశ్చితి ప్రధాన ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోందని వివరించారు. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని లక్ష్యిత పరిధి అయిన నాలుగు శాతం లోపునకు తీసుకువచ్చే విషయంలో ఎలాంటి మార్పులేదన్నారు. 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి స్థిరంగా ఉంటుందని అంచనా వేశారు.

గవర్నర్‌ ప్రసంగంలోని ఇతర కీలకాంశాలు..

  • ఆహార ధరలపై ఒత్తిళ్లను ద్రవ్య పరపతి విధాన కమిటీ ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పర్యవేక్షిస్తుంది.
  • దేశ ఆర్థిక కార్యకలాపాల్లోని జోరు 2024-25 ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుంది.
  • మూలధన వ్యయం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న నిరంతర మద్దతుతో దేశంలో పెట్టుబడులు పుంజుకుంటున్నాయి.
  • పట్టణాల్లో వినిమయం బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో గిరాకీ పుంజుకుంటోంది.
  • 2024-25కు జీడీపీ వృద్ధిరేటు 7 శాతంగా అంచనా.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతం, 2024-25లో 4.5 శాతంగా అంచనా.
  • భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థలపై ప్రభావం చూపుతున్నాయి. తద్వారా ముడి చమురు వంటి కమొడిటీ ధరలపై ఒత్తిడిని పెంచుతున్నాయి.
  • 2023-24లో భారత కరెన్సీ రూపాయి స్వల్ప ఒడిదొడుకులను చవిచూసింది. మారకపు విలువ స్థిరంగా కొనసాగుతోంది. 
  • అత్యధిక రెమిటెన్స్‌లను స్వీకరించే దేశంగా భారత్‌ కొనసాగుతోంది.
  • భారత విదేశీ మారక నిల్వలు 622.5 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి.
  • ఇకపై అన్ని రిటైల్‌, ఎంఎస్‌ఎంఈ రుణాలకు ‘కీ ఫ్యాక్ట్‌ స్టేట్‌మెంట్‌’ తప్పనిసరి. దీన్ని అమలు చేసేందుకు బ్యాంకులకు కొంత గడువు ఇవ్వనున్నారు.
  • డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత పెంపొందించడానికి, అటువంటి లావాదేవీల ప్రామాణీకరణ కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ను తీసుకురావాలని ప్రతిపాదన.
  • ఆఫ్‌లైన్‌లోనూ రిటైల్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ డిజిటల్‌ కరెన్సీ పనిచేసేలా చర్యలు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని