RBI Monetary Policy: ఏడోసారీ వడ్డీరేట్లు యథాతథం

RBI Monetary Policy: రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. ఎలాంటి మార్పు చేయకపోవడం వరుసగా ఇది ఏడోసారి.

Updated : 05 Apr 2024 11:25 IST

ముంబయి: ఆర్థిక నిపుణుల ముందస్తు అంచనాలకు అనుగుణంగానే ‘రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) మరోసారి కీలక వడ్డీరేట్లను యథాతథంగా కొనసాగించింది. రెపోరేటును (Repo Rate) 6.5 శాతం వద్ద స్థిరంగా ఉంచుతున్నట్లు ప్రకటించింది. వరుసగా ఏడోసారి ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. బుధవారం ప్రారంభమైన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్యపరపతి  విధాన (RBI Monetary Policy) సమీక్ష సమావేశ నిర్ణయాలను గవర్నర్‌ శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. భారత ఆర్థిక వ్యవస్థ పరిణామ క్రమానికి రిజర్వ్ బ్యాంక్ ప్రయాణానికి దగ్గరి సంబంధం ఉందని దాస్‌ అన్నారు. సంస్థపై ఉన్న బహుళ బాధ్యతలను నిర్వర్తిస్తూనే కొత్త అంశాలను స్వీకరిస్తామన్నారు. నూతన ఆవిష్కరణల కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఆర్‌బీఐ ఇటీవలే 90వ వార్షికోత్సవం నిర్వహించుకున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ద్రవ్యపరపతి విధాన కమిటీ (MPC) నిర్ణయాల్లో కీలకాంశాలు..

 • ద్రవ్యోల్బణాన్ని 4 శాతం లక్ష్యానికి తీసుకురావడంపై దృష్టి కేంద్రీకరించేందుకు బలమైన వృద్ధి అవకాశాలు వెసులుబాటు కల్పిస్తున్నాయి.
 • ద్రవ్యోల్బణాన్ని లక్షిత పరిధి అయిన 4 శాతానికి తీసుకువచ్చేందుకు ఎంపీసీ కట్టుబడి ఉంది.
 • ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది. ద్రవ్యోల్బణ పెరుగుదలపై ఆర్‌బీఐ నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
 • గ్లోబల్ జీడీపీలో రుణాల నిష్పత్తి అధికంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలపై దాని ప్రభావం ఉండొచ్చు.
 • గ్రామీణ గిరాకీ పుంజుకుంటోంది. ఇది 2024-25లో ఆర్థిక వృద్ధికి తోడ్పడుతుందని అంచనా.
 • ద్రవ్యోల్బణ ఒత్తిడి తగ్గడం, తయారీ, సేవల రంగాలలో స్థిరమైన వృద్ధి ప్రైవేట్ పెట్టుబడులను ఊతమివ్వనుంది.
 • 2024-25లో భారత జీడీపీ వృద్ధిరేటు అంచనా 7 శాతం. జూన్‌ త్రైమాసికంలో 7 శాతం, సెప్టెంబరులో 6.9 శాతం, మూడు, నాలుగు త్రైమాసికాల్లో 7 శాతం వృద్ధిరేటు అంచనా.
 • ప్రపంచ వృద్ధి పుంజుకుంటోంది. ముడి చమురు ధరల పెరుగుదలను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉంది.
 • కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కమొడిటీ ధరలను తలకిందులు చేసే ప్రమాదం ఉంది.
 • స్థూల ద్రవ్యోల్బణ పెరుగుదలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నాలకు అధిక ఆహార ద్రవ్యోల్బణం గండికొట్టొచ్చు.
 • సాధారణ వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ఆర్థిక సంవత్సరం ద్రవ్యోల్బణాన్ని 4.5 శాతంగా అంచనా. తొలి త్రైమాసికంలో 4.9%, రెండో త్రైమాసికంలో 3.8%, మూడో త్రైమాసికంలో 4.6%, నాలుగో త్రైమాసికంలో 4.5 శాతంగా అంచనా.
 • వర్ధమాన మార్కెట్ల కరెన్సీలతో పోలిస్తే భారత రూపాయి ఒక పరిధిలోనే కొనసాగుతోంది. 2023లో మన రూపాయి అత్యల్ప ఒడుదొడుకులను చవిచూసింది.
 • బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు సహా ఇతర ఆర్థిక సంస్థలు పాలనాపరమైన అంశాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
 • మార్చి 29 నాటికి 645.6 బిలియన్‌ డాలర్ల వద్ద భారత విదేశీ మారక నిల్వలు జీవనకాల గరిష్ఠానికి చేరాయి. రెమిటెన్స్‌లను స్వీకరిస్తున్న అతిపెద్ద దేశంగా భారత్‌ కొనసాగుతోంది.

 • ప్రభుత్వ సెక్యూరిటీ మార్కెట్‌లో రిటైల్‌ భాగస్వామ్యాన్ని పెంచేందుకు ఆర్‌బీఐ మొబైల్‌ యాప్‌ను తీసుకురానుంది.

 • అంతర్జాతీయ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్‌లో సావరిన్ గ్రీన్ బాండ్‌పై ట్రేడింగ్ కోసం ఆర్‌బీఐ త్వరలో స్కీమ్‌ను నోటిఫై చేయనుంది.

 • UPI ద్వారా నగదు డిపాజిట్లను అనుమతించాలని RBI ప్రతిపాదించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని