RBI Interest Rates: పాత వడ్డీరేట్లే.. అంచనాలకు అనుగుణంగానే ఆర్‌బీఐ నిర్ణయం!

RBI Interest Rates: ఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు గతకొన్ని రోజులుగా అంచనా వేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. దీనికనుగుణంగానే ఆర్‌బీఐ నిర్ణయం వెలువడింది.

Updated : 06 Oct 2023 15:18 IST

ముంబయి: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కీలక రేట్లను యథాతథంగా కొనసాగించింది. ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ నేతృత్వంలో బుధవారం ప్రారంభమైన పరపతి విధాన కమిటీ (MPC) సమీక్ష నిర్ణయాలను శుక్రవారం ప్రకటించారు. రెపోరేటు (Repo rate)ను 6.5 శాతం వద్ద కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఎంఎస్‌ఎఫ్‌, బ్యాంక్‌ రేట్‌ సైతం 6.75 శాతం వద్ద స్థిరంగా ఉన్నాయి. వడ్డీ రేట్లను మార్చకుండా అలాగే కొనసాగించడం వరుసగా ఇది నాలుగోసారి.

పాలసీ రేట్లు ఇలా ఉన్నాయి..

  • రెపో రేటు - 6.50%
  • ఎస్‌డీఎఫ్‌ఆర్‌- 6.25%
  • ఎంఎస్‌ఎఫ్‌ఆర్‌- 6.75%
  • బ్యాంక్‌ రేటు- 6.75%
  • రివర్స్‌ రెపో రేటు- 3.35%

గత ఎంపీసీ సమావేశం జరిగిన ఆగస్టుతో పోలిస్తే ఈసారి ద్రవ్యోల్బణం (Retail inflation) పెరిగింది. వృద్ధి బలంగానే ఉన్నప్పటికీ.. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీరేటు నిర్ణయాలపరంగా దూకుడును కొనసాగిస్తుండటంతో అంతర్జాతీయంగా కొన్ని అంశాలు ప్రతికూలంగా మారాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆర్‌బీఐ (RBI) కీలక రేట్లను యథాతథంగానే ఉంచేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు గతకొన్ని రోజులుగా అంచనా వేస్తూ వచ్చారు. తాజా ఆర్‌బీఐ నిర్ణయాలు కూడా అందుకు అనుగుణంగానే ఉండడం గమనార్హం. వడ్డీరేట్లను మార్చకుండా అలాగే కొనసాగించాలని ఎంపీసీ ఏకగ్రీవంగా నిర్ణయించినట్లు శక్తికాంత దాస్‌ వెల్లడించారు. ద్రవ్యోల్బణాన్ని గమనిస్తూనే.. దాన్ని లక్ష్యిత పరిధిలోకి తీసుకొచ్చేందుకు ఆర్‌బీఐ కట్టుబడి ఉందని తెలిపారు.

మూడుకు మించి బ్యాంకు ఖాతాలున్నాయా..కాస్త ఆలోచించాల్సిందే! ఎందుకంటే..

ద్రవ్యోల్బణ లక్ష్యం 4 శాతం..

ఆర్‌బీఐ ద్రవ్యోల్బణ (Retail inflation) లక్ష్యం 2-4 శాతం కాదని.. అది నాలుగు శాతమని శక్తికాంత దాస్ తెలిపారు. పరిస్థితులకు అనుగుణంగా లక్ష్యాన్ని ఎప్పటికప్పుడు సవరిస్తామన్నారు. సెప్టెంబరులో ద్రవ్యోల్బణం (Retail inflation) దిగొచ్చే అవకాశం ఉందని అంచనా వేశారు. కూరగాయల ధరలు, వంటగ్యాస్‌ సిలిండర్ రేటు తగ్గిన నేపథ్యంలో స్వల్పకాలంలో ద్రవ్యోల్బణం (Retail inflation) దిగొస్తుందని తెలిపారు. 2023- 24లో రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేశారు. మూడో త్రైమాసికంలో ఆహార పదార్థాల ధరల్లో స్థిరమైన తగ్గుదల నమోదయ్యే సూచనలు లేవని తెలిపారు. ప్రస్తుతం 6.8 శాతంగా ఉన్న రిటైల్‌ ద్రవ్యోల్బణం వచ్చే ఏడాదికి 5.2 శాతానికి తగ్గొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ఆహారపదార్థాలు, ఇంధన ధరలు అకస్మాత్తుగా పెరిగితే పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆర్‌బీఐ సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు.

ద్రవ్యోల్బణ అంచనాలు..

  • 2023-24 - 5.4%
  • 2023-24 రెండో త్రైమాసికం - 6.4%
  • 2023-24 మూడో త్రైమాసికం - 5.6%
  • 2023-24 నాలుగో త్రైమాసికం - 5.2%
  • 2024-25 తొలి త్రైమాసికం - 5.2%

వృద్ధిరేటు ఇలా..

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిరేటు అంచనాలను ఆర్‌బీఐ 6.5 శాతంగా పేర్కొంది. ప్రైవేట్‌ రంగంలో మూలధన వ్యయం పుంజుకుంటోందని శక్తికాంత దాస్‌ తెలిపారు. బలమైన గిరాకీ నేపథ్యంలో దేశీయ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా మారుతోందన్నారు. ఆస్తుల నాణ్యత మెరుగైన నేపథ్యంలో భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ బలం సంతరించుకుంటోందన్నారు. సెప్టెంబరు 29 నాటికి దేశ విదేశీ మారక నిల్వలు 586.9 బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు వెల్లడించారు.

వృద్ధిరేటు అంచనాలు..

  • 2023-24 - 6.5%
  • 2023-24 రెండో త్రైమాసికం - 6.5%
  • 2023-24 మూడో త్రైమాసికం - 6.0%
  • 2023-24 నాలుగో త్రైమాసికం - 5.7%
  • 2024-25 తొలి త్రైమాసికం - 6.6%

అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకుల్లో బుల్లెట్‌ పేమెంట్‌ స్కీమ్‌ కింద బంగారు రుణాలను రెండింతలు పెంచి రూ.4 లక్షలు చేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది. మరోవైపు పేమెంట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్ ఫండ్‌ స్కీమ్‌ను 2025 డిసెంబర్‌ వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కస్టమర్ల ప్రయోజనాలను పరిరక్షించడం కోసం అంతర్గత అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ను మరింత పటిష్ఠం చేస్తామన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని