Bank Accounts: బ్యాంకు ఖాతాలు అవసరానికి మించితే

బ్యాంకు ఖాతా లేకుండా ఆర్థిక లావాదేవీలేమీ చేయలేం. అదే సమయంలో అవసరానికి మించి ఖాతాలు ఉండటమూ కొన్నిసార్లు చిక్కులను తెస్తుంది. రెండు లేదా మూడు ఖాతాలు ఉండటం ఈ రోజుల్లో సహజం. రెండు ఖాతాల వరకూ అవసరం కూడా.

Updated : 06 Oct 2023 07:47 IST

బ్యాంకు ఖాతా లేకుండా ఆర్థిక లావాదేవీలేమీ చేయలేం. అదే సమయంలో అవసరానికి మించి ఖాతాలు ఉండటమూ కొన్నిసార్లు చిక్కులను తెస్తుంది. రెండు లేదా మూడు ఖాతాలు(Bank Accounts) ఉండటం ఈ రోజుల్లో సహజం. రెండు ఖాతాల వరకూ అవసరం కూడా. కానీ, మూడుకు మించి ఉన్నప్పుడు మాత్రం కాస్త ఆలోచించాల్సిందే.  ప్రతి ఖాతాలోనూ ఎంతో కొంత కనీస నిల్వ ఉంచాల్సిందే. కొన్ని బ్యాంకుల్లో ఇది రూ.1,000 ఉంటే.. మరికొన్నింటిలో రూ.10,000 వరకూ ఉండొచ్చు. సున్నా నిల్వ ఖాతాలూ ఉన్నప్పటికీ వీటితో పెద్ద ప్రయోజనాలేమీ ఉండవు. నగరాల్లో ఉన్న బ్యాంకుల్లో అధిక నిల్వ అవసరం ఉంటుంది. అనేక ఖాతాల్లో ఇలా కనీస నిల్వ ఉంచడం వల్ల నష్టం తప్ప ఉపయోగం లేదు. ఈ నిల్వపై వచ్చే వార్షిక వడ్డీ 3.5 నుంచి 4 శాతం వరకే ఉంటుంది. తక్కువ ఆదాయం ఉన్న వారు వీలైనంత వరకూ బ్యాంకు ఖాతాల సంఖ్యను తగ్గించుకోవడమే మంచిది.

బహుళ బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తున్నప్పుడు ఏ బ్యాంకు ఎంత రుసుమును విధిస్తుందో గమనించడం కష్టమవుతుంది. ఉదాహరణకు ఒక బ్యాంకు డెబిట్‌ కార్డు కోసం వార్షిక రుసుము రూ.250 నుంచి రూ.750 వరకూ విధిస్తుంది. కొన్ని బ్యాంకులు అంతర్జాతీయ డెబిట్‌ కార్డుల పేరుతో రూ.1,000 వరకూ ఛార్జీలను విధిస్తుంటాయి. కనీస నిల్వ లేకపోతే అదనపు రుసుములు తప్పవు. అన్ని బ్యాంకుల ఖాతా వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండటం కష్టం. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారు ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

ఐటీ రిటర్నులలో అన్ని బ్యాంకు ఖాతాల వివరాలూ పొందుపర్చాల్సి ఉంటుంది. ఇదీ ఒక రకంగా ఇబ్బందే. ప్రతి బ్యాంకు ఖాతాలోని లావాదేవీలను తప్పులు లేకుండా నిశితంగా పరిశీలించాలి. ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే.. వాటిని చూడటం అంత తేలిక కాదు. ముఖ్యంగా చెల్లింపు యాప్‌లను వాడేటప్పుడు బ్యాంకులను తరచూ మారుస్తూ ఉంటే ఖర్చుల లెక్క తీయడమూ సాధ్యం కాదు.

బ్యాంకు ఖాతాల్లో క్లెయిం చేయని మొత్తం రూ.కోట్లలో ఉంది. ఇందులో పొదుపు ఖాతాలు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లూ ఉన్నాయి. ఖాతాదారులు మరణించిన సందర్భంలో, వారి వారసులు అన్ని బ్యాంకులకూ వెళ్లలేకపోతున్నారు. బ్యాంకు ఖాతాల వివరాలూ సరిగ్గా తెలియకపోవడమూ అందుకు కారణం.
వీలైనంత వరకూ రెండు లేదా మూడు ఖాతాలకే పరిమితం కావడం ఎప్పుడూ మంచిది. మీ వేతనం ఖాతా కాకుండా మరో బ్యాంకు ఖాతా ఉంటే సరిపోతుంది. మరో ఖాతా జీవిత భాగస్వామితో కలిసి ఉమ్మడిగా ఉండాలి. ఒకసారి మీ బ్యాంకు ఖాతాలను సమీక్షించి, తగిన నిర్ణయాన్ని తీసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని