RBI: రుణ రికవరీకి ఆ సమయంలో నో కాల్స్‌!

రుణ రికవరీకి సంబంధించి ఆర్‌బీఐ నిబంధనలు కఠినతరం చేయబోతోంది. దీనికి సంబంధించి ముసాయిదాను తీసుకొచ్చి అభిప్రాయాలు స్వీకరిస్తోంది.

Published : 26 Oct 2023 20:33 IST

ముంబయి: రుణ బకాయిల వసూలుకు సంబంధించిన రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) నిబంధనలు కఠినతరం చేస్తోంది. ఇందుకోసం కఠిన నిబంధనలను ప్రతిపాదిస్తోంది. రుణ బకాయి వసూలు కోసం రుణ సంస్థ గానీ, వాటి ఏజెంట్లు గానీ రుణ గ్రహీతకు ఉదయం 8 లోపు, సాయంత్రం 7 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్ చేయకూడదని పేర్కొంది. అలాగే, బ్యాంకులు, బ్యాంకింగేతర సంస్థలు.. విధాన రూపకల్పన, కేవైసీ నిబంధనలు నిర్ణయించడం, రుణాల మంజూరుకు సంబంధించిన ప్రధాన మేనేజ్‌మెంట్‌ విధులను ఔట్‌సోర్స్‌ చేయకూడదని ముసాయిదాలో ఆర్‌బీఐ పేర్కొంది. 

ఈ మేరకు ఆర్థిక సేవల్లో ఔట్‌ సోర్సింగ్‌, ప్రవర్తనా నియమావళికి సంబంధించి ముసాయిదాను ఆర్‌బీఐ విడుదల చేసింది. దీని ప్రకారం.. డైరెక్ట్‌ సేల్స్‌ ఏజెంట్లు, డైరెక్ట్‌ మార్కెటింగ్‌ ఏజెంట్లు, రికవరీ ఏజెంట్లకు సంబంధించి నియంత్రిత సంస్థలు బోర్డు ఆమోదించిన ప్రవర్తనా నియామావళిని అమలు చేయాలని ఆర్‌బీఐ పేర్కొంది. కస్టమర్లతో మాట్లాడే విషయంలో ఏజెంట్లకు తగిన శిక్షణ ఇవ్వాలని సూచించింది. కస్టమర్లకు కాల్‌ చేయడం, చేసే సమయం, కస్టమర్‌ ప్రైవసీ, ప్రొడక్ట్‌ నిబంధనలు, షరతులు కస్టమర్‌కు అర్థమయ్యేలా వివరించేలా వారికి మార్గదర్శనం చేయాలని ఆర్‌బీఐ పేర్కొంది. 

రుణ వసూలు విషయంలో నియంత్రిత సంస్థలు గానీ, రికవరీ ఏజెంట్లు గానీ వ్యక్తులను భౌతికంగా, మౌఖికంగా గానీ బెదిరించడం, వేధించడం వంటి చేయకూడదని ఆర్‌బీఐ తన ముసాయిదాలో పేర్కొంది. నలుగురిలో రుణ గ్రహీతలను అవమానించడం వంటివి తగదని తెలిపింది. రుణ గ్రహీతలకు గానీ, గ్యారెంటేటర్లకు గానీ, వారి కుటుంబ సభ్యుల గోప్యతకు భంగం కలిగించకూడదని స్పష్టంచేసింది. దీనిపై నవంబర్‌ 28 వరకు భాగస్వామ్య పక్షాల నుంచి ఆర్‌బీఐ అభిప్రాయాలను స్వీకరించనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు