RBI annual report: ఆర్‌బీఐ బ్యాలన్స్‌షీట్‌ రూ.70.48 లక్షల కోట్లు

ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధిని నమోదు చేయగలదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా వేస్తోంది.

Published : 31 May 2024 03:58 IST

పాకిస్థాన్‌ జీడీపీకి 2.5 రెట్లు
2024-25లో వృద్ధి అంచనా 7%
బ్యాంకింగ్‌లో మోసాల అడ్డకట్టకు చర్యలు
వార్షిక నివేదిక

ముంబయి: ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న దేశంగా భారత్‌ కొనసాగుతుందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7% వృద్ధిని నమోదు చేయగలదని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) అంచనా వేస్తోంది. స్థూల ఆర్థిక మూలాలు బలోపేతం అవుతుండడం ఇందుకు నేపథ్యమని గురువారం విడుదల చేసిన వార్షిక నివేదికలో పేర్కొంది. 2021-22లో 9.1%, 2022-23లో 7.2% వృద్ధి నమోదు కాగా, 2023-24లో వృద్ధిరేటు 7.6 శాతానికి చేరుతుందనే అంచనా ఉంది. 7 శాతం లేదా అంతకంటే అధిక వృద్ధిని వరుసగా మూడో ఆర్థిక సంవత్సరంలోనూ నమోదు చేయనుండటం విశేషం. అనిశ్చిత పరిస్థితుల్లోనూ 2023-24లో భారత ఆర్థికం బలంగా రాణించిందని ఆర్‌బీఐ వివరించింది.

లక్ష్యం దిశగా ద్రవ్యోల్బణం

రానున్న కాలంలో ద్రవ్యోల్బణం మరింత తగ్గుతుందని, లక్ష్యం దిశగా దిగి వస్తున్నట్లు ఆర్‌బీఐ అంచనా వేసింది. సరఫరా వైపు సమస్యల కారణంగా ఆహార ద్రవ్యోల్బణం విషయంలో అప్రమత్తంగా ఉండక తప్పదని తెలిపింది. 2023-24లో టోకు ద్రవ్యోల్బణం 5.4 శాతానికి తగ్గింది. 2022-23లో ఇది 6.7 శాతంగా ఉంది. వినియోగదారు ధరల సూచీ (సీపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం కూడా ఆహార, ఇంధనాన్ని మినహాయిస్తే 6.1% నుంచి 4.3 శాతానికి పరిమితమైంది.

2023-24లో ఖరీఫ్, రబీ సీజన్లకు కనీస మద్దతు ధర (ఎమ్‌ఎస్‌పీ) వల్ల అన్ని పంటల ఉత్పత్తి వ్యయంపై కనీసం 50% అధికంగా ప్రయోజనం దక్కిందని నివేదిక తెలిపింది.

కరోనా ముందు స్థాయికి..

2023-24లో ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీటు 11.08% వృద్ధి పెరిగి రూ.70.48 లక్షల కోట్ల (845 బిలియన్‌ డాలర్ల)కు చేరింది. పాకిస్థాన్‌ మొత్తం జీడీపీ 340 బి. డాలర్ల (సుమారు రూ.28 లక్షల కోట్ల)తో పోలిస్తే ఇది దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. 2022-23లో ఇది రూ.63.44 లక్షల కోట్లుగా నిలిచింది. కరోనా ముందు స్థాయికి ఆర్థిక పరిస్థితులు పుంజుకోవడంతో, 2024 మార్చి చివరకు భారత జీడీపీలో 24.1 శాతానికి ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీటు చేరింది. అంతక్రితం ఏడాది 23.5 శాతంగానే ఉంది. 

ఆర్‌బీఐ ఆదాయం 17% పెరగడం, వ్యయాలు 56.3% తగ్గడంతో పాటు విదేశీ సెక్యూరిటీల వడ్డీ ఆదాయం రాణించడంతో అదనపు నిల్వలు 141.23% పెరిగి రూ.2.11 లక్షల కోట్లకు చేరాయి. వీటినే కేంద్రానికి డివిడెండు రూపంలో బదిలీ చేస్తున్నట్లు తెలిపింది.

ఆర్‌బీఐ వద్ద 822 టన్నుల బంగారం

విదేశీ పెట్టుబడులు, బంగారం, రుణాలు-అడ్వాన్సులు వరుసగా 13.9%, 18.26%, 30.05% చొప్పున పెరగడం వల్ల కూడా ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీటు రాణించింది. మొత్తం విలువలో దేశీయ ఆస్తుల విలువ 23.31%గా ఉండగా.. విదేశీ కరెన్సీ, బంగారం, రుణాలు, భారత్‌ వెలుప ఆర్థిక సంస్థలకిచ్చిన రుణాలు మొత్తం ఆస్తుల్లో 76.69 శాతంగా ఉన్నాయి. ఆర్‌బీఐ వద్ద 822.10 మెట్రిక్‌ టన్నుల బంగారం ఉంది. ఇందులో 308.03 మెట్రిక్‌ టన్నుల పసిడిని, నోట్ల జారీకి దన్నుగా పక్కకు తీసిపెట్టారు.

ఇష్యూ డిపార్ట్‌మెంట్‌ వద్ద ఉన్న పసిడి విలువ 2023 మార్చి 31న రూ.1,40,765.60 కోట్లుగా ఉండగా.. 2024 మార్చి చివరికి 16.94% పెరిగి రూ.1,64,604.91 కోట్లకు చేరింది. అదనంగా 6.94 టన్నుల పసిడి జత చేరడంతో పాటు పసిడి ధర పెరగడం, రూపాయి విలువ క్షీణించడం ఇందుకు సహకరించింది. 


బ్యాంకింగ్‌ రంగంలో 36,075 మోసాలు

2023-24లో బ్యాంకింగ్‌ రంగంలో మొత్తం 36,075 మోసాలు జరిగాయి. 2022-23లో ఈ సంఖ్య 13,564 మాత్రమే. అయితే మోసాలతో ముడిపడిన డబ్బు విలువ మాత్రం రూ.26,127 కోట్ల నుంచి 46.7% తగ్గి రూ.13,930 కోట్లకు పరిమితమైంది. మోసాలను అరికట్టడంతో పాటు చెల్లింపుల ప్రక్రియను మరింత విస్తృతం చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. ఇందు కోసం.. నగదు బదిలీకి ముందే రియల్‌ టైంలో నగదు స్వీకరించే వ్యక్తి పేరును పరిశీలించుకునే అవకాశాన్ని తెస్తున్నట్లు తెలిపింది. కొత్తగా వచ్చిన ‘ద డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ యాక్ట్‌ 2023’కు అనుగుణంగా దీనిని తీసుకువస్తామని తెలిపింది. 

  • గత మూడేళ్లలో ప్రైవేటు రంగ బ్యాంకుల్లోనే అధిక సంఖ్యలో మోసాలు జరిగాయి. తక్కువ విలువ ఉన్న కార్డు/ ఇంటర్నెట్‌ మోసాలే ఇందుకు కారణం. 
  • మోసాల విలువ విషయంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల వాటా ఎక్కువగా ఉంది. రుణ విభాగాల్లో మోసాలే ఇందుకు నేపథ్యం.  2022-23, 2023-24లో నమోదైన మోసాలకు సంబంధించి మోసం చోటుచేసుకున్న సమయానికి, వాటిని గుర్తించిన సమయానికి మధ్య చాలా కాలావధి ఉందని నివేదిక విశ్లేషించింది. 

మొత్తం నగదులో రూ.500 నోట్లే 86.5%

  • 2024 మార్చి చివరకు మొత్తం కరెన్సీలో రూ.500 నోట్ల వాటా 86.5 శాతానికి చేరింది. ఏడాది కిందట వీటి వాటా 77.1% మాత్రమే. రూ.2000 నోట్లను ఉపసంహరిస్తున్నట్లు 2023 మేలో ప్రకటించడం ఇందుకు కారణమని ఆర్‌బీఐ వెల్లడించింది. మొత్తం నగదులో రూ.2000 నోట్ల వాటా ఏడాది కిందట 10.8 శాతంగా ఉండగా.. ఇపుడు 0.2 శాతానికి పరిమితమైంది.
  • 2023-24లో 26,000కు పైగా నకిలీ రూ.2000 నోట్లు కనిపించాయి. అంతక్రితం ఏడాది 9806 నోట్లు మాత్రమే నకిలీవి లభించాయి. రూ.500 నోట్లలో మాత్రం నకిలీవి 91,110 నుంచి 85,711కి తగ్గాయి. 
  • పరిమాణం పరంగా చూస్తే రూ.500 నోట్లు దాదాపు 5.16 లక్షలు ఉన్నాయి. ఆ తర్వాతి స్థానంలో రూ.10 నోట్లు(2.49 లక్షలు) ఉన్నాయి. 
  • చలామణీలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ, పరిమాణం వరుసగా 3.9%, 7.8 శాతం మేర వృద్ధి చెందాయి. ఏడాది క్రితం ఇవి వరుసగా 7.8%, 4.4% మేర పెరిగాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని