Paytm: నిరంతర ఉల్లంఘనల వల్లే పేటీఎంపై చర్యలు: ఆర్‌బీఐ

Paytm: పేటీఎంపై చర్యలు తీసుకోవడానికి దారితీసిన కారణాలను ఆర్‌బీఐ వివరించింది. తాము ఎలాంటి వ్యవస్థాపూర్వక లోపాలను గుర్తించలేదని తెలిపింది.

Updated : 08 Feb 2024 17:19 IST

ముంబయి: పేటీఎం (Paytm) వ్యవహారంపై రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా (RBI) తొలిసారి స్పందించింది. ఈ విషయంలో వ్యవస్థాగతంగా ఎలాంటి లోపాలు లేవని.. కేవలం తరచూ నిబంధనలను ఉల్లంఘించటం వల్లే చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని గవర్నర్‌ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే, ఏ విషయంలో నిబంధనలను పాటించలేదనేది చెప్పడానికి మాత్రం నిరాకరించారు.

ఆర్‌బీఐ బాధ్యతాయుత నియంత్రణ సంస్థ అని దాస్‌ అన్నారు. వివిధ కంపెనీలతో పరస్పర అవగాహనతో పనిచేస్తుందని తెలిపారు. నిబంధనలు అమలుచేయడానికి తగినంత సమయం ఇస్తామని చెప్పారు. సమస్య తీవ్రతను బట్టే చర్యలు ఉంటాయని తెలిపారు. వ్యవస్థాగత స్థిరత్వం, కస్టమర్ల ప్రయోజనాల పరిరక్షణ కోసమే పేటీఎంపై (Paytm) ఆంక్షలు విధించామని చెప్పారు.

కైనటిక్‌ ఇ-లూనా వచ్చేసింది.. సింగిల్‌ ఛార్జ్‌తో 110km

ఆర్థిక రంగంలో వచ్చే వినూత్న ఆవిష్కరణలకు మద్దతునివ్వడానికి ఆర్‌బీఐ (RBI) ఎప్పుడూ కట్టుబడి ఉందని.. దాంట్లో ఎలాంటి అనుమానం అవసరం లేదని దాస్‌ స్పష్టంచేశారు. పేటీఎం విషయంలో వివిధ వర్గాల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. త్వరలోనే వాటికి సమాధానాలు చెబుతామని వెల్లడించారు.

పేటీఎం మనీపై సీడీఎస్‌ఎల్‌ తనిఖీ..

ఆర్‌బీఐ ఆంక్షల నేపథ్యంలో పేటీఎంకు (Paytm) చెందిన వివిధ వ్యాపార విభాగాలపై నియంత్రణ సంస్థలు దృష్టిసారించాయి. వివిధ అంశాల్లో నిబంధనలను పాటిస్తున్నాయా.. లేదా.. అని తనిఖీ చేస్తున్నాయి. తాజాగా ఈ సంస్థకు చెందిన వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ విభాగం ‘పేటీఎం  మనీ’పై ‘సెంట్రల్‌ డిపాజిటరీ సర్వీసెస్‌ లిమిటెడ్‌’ సమీక్ష ప్రారంభించింది. కేవైసీ నిబంధనలేమైనా ఉల్లంఘించిందేమో పరిశీలిస్తోంది.

మళ్లీ లోయర్‌ సర్క్యూట్‌..

రెండు రోజుల విరామం తర్వాత పేటీఎం (Paytm Share Price) షేర్లు మళ్లీ గురువారం నష్టాల్లోకి జారుకున్నాయి. బీఎస్‌ఈలో 9.99 శాతం కుంగి రూ.447.10 వద్ద లోయర్‌ సర్క్యూట్‌ని తాకింది. దీంతో కంపెనీ మార్కెట్‌ విలువ రూ.28,300 కోట్లకు పడిపోయింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని