RBI: ఆర్‌బీఐ వద్ద ఎంత బ్యాలెన్స్‌ ఉందో తెలుసా?

RBI: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ 11శాతం పెరిగింది. దీనివల్లే ప్రభుత్వానికి కేంద్ర బ్యాంకు పెద్దఎత్తున డివిడెండ్‌ను ప్రకటించింది.

Published : 30 May 2024 16:39 IST

ముంబయి: 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక నివేదికను భారతీయ రిజర్వ్‌ బ్యాంకు (Reserve Bank of India) గురువారం విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ (Balance Sheet) 11.08శాతం పెరిగిందని వెల్లడించింది. 2023 మార్చి నాటికి కేంద్ర బ్యాంకు వద్ద రూ.63.45 లక్షల కోట్ల బ్యాలెన్స్‌ ఉండగా.. గత ఆర్థిక సంవత్సరంలో అది రూ.7.02 లక్షల కోట్లు పెరిగి రూ.70.47 లక్షల కోట్లకు చేరిందని తెలిపింది. ఇది పాకిస్థాన్‌ దేశ జీడీపీ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ కావడం గమనార్హం.

2024 మార్చి నాటికి ఆర్‌బీఐ (RBI) నికర ఆదాయం రూ.2.11 లక్షల కోట్లుగా ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈ ఆదాయం రూ.87,420 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో విదేశీ పెట్టుబడులు 13.90శాతం, బంగారం (డిపాజిట్లు, తాకట్టు రూపంలో) 18.26శాతం, రుణాలు, అడ్వాన్సులు 30.05శాతం పెరిగాయి. దీనివల్ల బ్యాలెన్స్‌ షీట్‌లో ఆస్తుల విలువ అమాంతం పెరిగిందని ఆర్‌బీఐ తమ నివేదికలో వెల్లడించింది. ఇక, కరెన్సీ నోట్ల జారీ 3.88 శాతం, డిపాజిట్లు 27శాతం, ఇతర అప్పులు 92.57శాతం పెరిగాయని తెలిపింది.

ఎల్‌ఐసీ ముందు పాక్‌ దిగదుడుపు.. ఆ దేశ జీడీపీ కంటే డబుల్‌ సొమ్ము!

గతంలో ఎన్నడూ లేనంతగా 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.2.11 లక్షల కోట్ల డివిడెండ్‌ (Dividend)ను ప్రభుత్వానికి చెల్లిస్తామని ఇటీవల ఆర్‌బీఐ ప్రకటించిన సంగతి తెలిసిందే. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆర్‌బీఐ రూ.87,416 కోట్లు డివిడెండ్‌ రూపంలో చెల్లించింది. దీంతో పోలిస్తే 2023-24 ఆర్థిక సంవత్సరంలో 140 శాతం అధికంగా డివిడెండ్‌ చెల్లిస్తుండటం గమనార్హం. బ్యాలెన్స్‌ షీట్‌ పెరిగిన కారణంగా డివిడెండ్‌ మొత్తాన్ని పెంచినట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ తాజా నివేదికలో వెల్లడించింది. నోట్ల జారీ, మానిటరీ విధానాలు, రిజర్వ్‌ మేనేజ్‌మెంట్‌ లక్ష్యాలు తదితర కార్యకలాపాలను ఆర్‌బీఐ ఈ బ్యాలెన్స్‌ షీట్‌లో పేర్కొంటుంది.

26% పెరిగిన అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్లు..

ఇక, గత ఆర్థిక సంవత్సరంలో ఎవరూ క్లెయిమ్‌ చేయని (Unclaimed Deposits) డిపాజిట్లు 26శాతం పెరిగాయని ఆర్‌బీఐ వెల్లడించింది. 2023 మార్చి నాటికి ఈ డిపాజిట్లు రూ.62,225 కోట్లుగా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.78,213 కోట్లకు చేరినట్లు తెలిపింది. 10 లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలుగా క్లెయిమ్‌ చేయని డిపాజిట్లను బ్యాంకులు.. ఆర్‌బీఐకి చెందిన డిపాజిటర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ అవేర్‌నెస్‌ (డీఈఏ) నిధికి బదిలీ చేస్తాయి.

క్లెయిమ్‌ చేయని డిపాజిట్ల పరిమాణాన్ని తగ్గించడానికి, అటువంటి డిపాజిట్లను నిజమైన క్లెయిమ్‌దారులకు తిరిగి ఇవ్వడానికి ఆర్‌బీఐ చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం UDGAM  (అన్‌క్లెయిమ్డ్‌ డిపాజిట్స్‌ గేట్‌వే టు యాక్సెస్‌ ఇన్ఫర్మేషన్‌)పేరుతో ఓ వెబ్‌పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని