ఎల్‌ఐసీ ముందు పాక్‌ దిగదుడుపు.. ఆ దేశ జీడీపీ కంటే డబుల్‌ సొమ్ము!

LIC AUM: ప్రభుత్వరంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ అరుదైన మైలురాయిని అందుకుంది. నిర్వహణలోని ఆస్తుల విలువ మొత్తం రూ.50లక్షల కోట్లు దాటింది. ఇది పాక్‌ జీడీపీ కంటే డబుల్‌.

Published : 29 May 2024 14:15 IST

LIC |  ఇంటర్నెట్‌ డెస్క్‌: బీమా అనగానే గుర్తొచ్చేది ప్రభుత్వ రంగానికి చెందిన ఎల్‌ఐసీనే (LIC). జీవిత బీమా రంగంలో తనదైన ముద్ర వేసుకుని అతిపెద్ద బీమా సంస్థగా అగ్రస్థానంలో కొనసాగుతోంది. ప్రైవేటు బీమా కంపెనీలు ఎన్నొచ్చినా ఏళ్లుగా దాని స్థానం పదిలం. అలాంటి ఈ కంపెనీ తాజాగా ఓ మైలురాయిని అందుకుంది. సంస్థ పరిధిలోని ఆస్తుల విలువ (AUM) విలువ రూ.50 లక్షల కోట్లు  దాటింది. ఈ మొత్తం పొరుగున ఉన్న పాకిస్థాన్‌ జీడీపీ కంటే ఇది రెండు రెట్లు అధికం.

మార్చితో ముగిసిన త్రైమాసికానికి వెల్లడించిన గణాంకాల్లో ఈ విషయం వెల్లడైంది. గతేడాది సంస్థ ఏయూఎం రూ.43,97,205 కోట్లుగా ఉండగా.. ఏడాదిలో ఈ మొత్తం 16.48 శాతం పెరిగి రూ.51,21,887 కోట్లకు చేరింది. డాలర్లలో చెప్పాలంటే 616 బిలియన్‌ డాలర్లు. అదే సమయంలో పాక్‌ జీడీపీ విలువ కేవలం 338.24 బిలియన్‌ డాలర్లు మాత్రమే. అంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కంటే మన ఎల్‌ఐసీ నిర్వహణలోని ఆస్తుల విలువే దాదాపు రెండింతలు ఉందన్నమాట.

ఆరోగ్య బీమాలోకి ఎల్‌ఐసీ

పాక్‌ విల విల..

దేశంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా పాక్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుదేలైంది. ఓ వైపు ప్రపంచ ఆర్థికంలో భారత్‌ తన సత్తా చాటుతుంటే.. పాక్‌ మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి రోజులు నెట్టుకొస్తోంది. రుణాల తిరిగి చెల్లించే విషయలో ఆ దేశ పరిస్థితి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ తాజాగా ఆందోళన వ్యక్తంచేసింది. ఆ దేశ అవసరాలు తీరాలంటే రాబోయే ఐదేళ్లకు సుమారు 123 బిలియన్‌ డాలర్లు కావాలని ఐఎంఎఫ్‌ అంచనా కట్టింది. 

ఎల్‌ఐసీ మిల మిల

మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఎల్‌ఐసీ రూ.40,676 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. ప్రీమియం వసూళ్ల ద్వారా వచ్చే ఆదాయం రూ.4,75,070 కోట్లుగా ఉంది. గడిచిన ఏడాదిలో పాలసీహోల్డర్లందరికీ 52,955.87 కోట్ల బోనస్‌ ఇచ్చింది. జీవిత బీమా రంగంలో 59 శాతం వాటాతో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఎల్‌ఐసీ.. అటు ఆరోగ్య బీమా రంగంలోకి అడుగు పెట్టాలని చూస్తోంది. దేశీయ స్టాక్‌ మార్కెట్‌లో మార్కెట్‌ విలువ పరంగా ఏడో అతిపెద్ద స్టాక్‌గా ఉంది. దీని విలువ రూ.6.46 లక్షల కోట్లుగా ఉంది. బుధవారం ఎల్‌ఐసీ షేరు స్వల్ప నష్టంతో 1006 వద్ద ట్రేడవుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని