Reliance TATA: అత్యంత ప్రభావశీల కంపెనీల్లో రిలయన్స్, టాటా గ్రూప్‌

ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాను టైమ్స్‌ సంస్థ విడుదల చేసింది. ఇందులో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్‌ ఉన్నాయి.

Published : 31 May 2024 03:43 IST

దిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రభావశీల 100 కంపెనీల జాబితాను టైమ్స్‌ సంస్థ విడుదల చేసింది. ఇందులో ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్‌ ఉన్నాయి. రిలయన్స్‌ను ‘భారత శక్తి’గా టైమ్‌ అభివర్ణించింది. టైమ్స్‌ జాబితాలో రిలయన్స్‌ చోటు చేసుకోవడం ఇది రెండోసారి. 2021లో తొలిసారిగా టైమ్‌ 100 ప్రభావశీల కంపెనీల్లో జియో ప్లాట్‌ఫామ్స్‌ స్థానం సాధించింది. తాజా జాబితాలో ఉన్న మరో భారతీయ కంపెనీగా సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నిలిచింది. టైమ్స్‌ జాబితాను అయిదు విభాగాలు- టైటన్స్, లీడర్స్, డిస్‌ప్యూటర్స్, ఇన్నోవేటర్స్, పయనీర్స్‌గా విభజించింది. ఇందులో టైటన్స్‌ విభాగంలో రిలయన్స్, టాటా గ్రూప్‌ ఉండగా, పయనీర్స్‌లో సీరమ్‌ ఉంది. 

  • 58 ఏళ్ల క్రితం ధీరూభాయ్‌ అంబానీ నేతృత్వంలో జౌళి సంస్థగా ప్రారంభమైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్, ప్రస్తుతం భారత దేశంలో అత్యంత విలువైన కంపెనీగా ఎదిగింది. కంపెనీ మార్కెట్‌ విలువ 200 బిలియన్‌ డాలర్ల కంటే అధికంగా ఉందని టైమ్‌ తెలిపింది. ఇంధన, రిటైల్, టెలికాం, ఇతర విభాగాల్లో కంపెనీ రాణిస్తోందని, ఫలితంగా ముకేశ్‌ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారని వెల్లడించింది. 
  • ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్‌ తయారీ సంస్థగా సీరమ్‌ అవతరించిందని టైమ్‌ పేర్కొంది. తట్టు, పోలియో, హెచ్‌పీవీ తదితర వ్యాధుల నుంచి రక్షణకు ఏటా 350 కోట్ల డోసుల వ్యాక్సిన్‌లను సంస్థ తయారు చేస్తోంది.
  • 1868లో స్థాపితమైన టాటా గ్రూప్‌.. ఉక్కు, సాఫ్ట్‌వేర్, వాచీలు, రసాయనాలు, ఏసీలు, ఫ్యాషన్, హోటళ్లు సహా పలు రంగాల్లో సత్తా చాటుతోంది. టాటా గ్రూప్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ విలువ 365 బి.డాలర్లు కాగా, పొరుగు దేశం పాకిస్థాన్‌ జీడీపీ కంటే ఇది అధికం.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని