Viacom18- Star India: వయాకామ్‌- స్టార్‌ ఇండియా విలీనం.. సీసీఐ ఆమోదం కోరిన రిలయన్స్‌

Viacom18- Star India: మీడియా వ్యాపారాల విలీనానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ సీసీఐ అనుమతి కోరింది. ఈ జాయింట్ వెంచర్‌ వల్ల పోటీ వాతావరణానికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదని తెలిపింది.

Published : 25 May 2024 16:20 IST

Viacom18- Star India | దిల్లీ: మీడియా వ్యాపారాలైన వయాకామ్‌ 18, స్టార్ ఇండియా విలీనానికి ముందడుగు పడింది. ప్రతిపాదిత విలీనానికి సంబంధించి ముకేశ్‌ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (CCI) అనుమతి కోరింది. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన వయాకామ్‌ 18, ది వాల్ట్‌ డిస్నీ కంపెనీకి చెందిన స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌కు చెందిన వినోద వ్యాపారాలను విలీనం చేయనున్నామని, తద్వారా జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటుకానుందని సీసీఐకు సమర్పించిన నోటీసులో పేర్కొంది. ఈ లావాదేవీల వల్ల దేశంలోని పోటీ వ్యాపారాలపై ఎలాంటి ప్రభావం పడబోదని రిలయన్స్‌ పేర్కొంది.

దేశంలో స్టార్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ పలు టీవీ ఛానెళ్లతో పాటు, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ (డిస్నీ+హాట్‌స్టార్‌)ను నిర్వహిస్తోంది. వయాకామ్‌ 18 కూడా బ్రాడ్‌కాస్టింగ్‌ టెలివిజన్‌ ఛానెళ్ల వ్యాపారాలతో పాటు, ఓ ఓటీటీని (జియో సినిమా) కూడా నడుపుతోంది. దీంతోపాటు ప్రొడక్షన్‌, మోషన్‌ పిక్చర్స్‌ డిస్ట్రిబ్యూషన్‌లోనూ ఉంది. ఇరు సంస్థలు కలిసి జాయింట్ వెంచర్‌ను ఏర్పాటుచేయాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలయన్స్‌, వాల్ట్‌ డిస్నీ ఓ ఒప్పందానికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ డీల్‌ పూర్తయితే వివిధ భాషల్లో వందకు పైగా ఛానెళ్లు, 2 ఓటీటీలు విలీన సంస్థ చేతిలో ఉంటాయి. ఈ జేవీకి నీతా అంబానీ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. ఈ సంయుక్త సంస్థలో 63.13 శాతం వాటా రిలయన్స్‌కు, 36.84 శాతం వాటా డిస్నీకు దఖలు పడనుంది. విలీనం అనంతరం ఓటీటీ వ్యాపారాభివృద్ధికి రూ.11,500 కోట్లు రిలయన్స్‌ పెట్టుబడిగా పెట్టనున్నట్లు రిలయన్స్‌ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని