Reliance: పదేళ్లలో రిలయన్స్‌ మూలధన వ్యయం 125 బిలియన్‌ డాలర్లు

Reliance: పదేళ్లలో ఓ2సీ, టెలికాం బిజినెస్‌పై దృష్టి సారించిన రిలయన్స్‌ దాదాపు 125 బిలియన్‌ డాలర్ల మూలధనాన్ని ఖర్చు చేసినట్లు గోల్డ్‌మన్‌ శాక్స్ వెల్లడించింది.

Published : 31 Mar 2024 14:33 IST

దిల్లీ: హైడ్రోకార్బన్, టెలికాం వ్యాపారాల విస్తరణ కోసం గత పదేళ్లలో రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) 125 బిలియన్‌ డాలర్లకు పైగా మూలధనాన్ని వెచ్చించిందని గోల్డ్‌మన్ శాక్స్‌ నివేదిక తెలిపింది. రాబోయే మూడేళ్లలో రిటైల్, నూతన ఇంధన రంగంపై దృష్టి సారించనున్నట్లు పేర్కొంది. దీర్ఘకాల క్యాపెక్స్‌ సైకిళ్ల నుంచి కంపెనీ క్రమంగా బయటకొస్తోందని విశ్లేషించింది.

‘‘రిలయన్స్‌ (Reliance) 2013-18 ఆర్థిక సంవత్సరాల మధ్య ‘ఆయిల్‌-టు-కెమికల్‌ (O2C)’ బిజినెస్‌లో 30 బిలియన్‌ డాలర్ల మూలధనాన్ని చొప్పించింది. 2013-24 మధ్య 4జీ/5జీ కోసం టెలికాం బిజినెస్‌లో 60 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టింది. దేశవ్యాప్త 5జీ విస్తరణ దాదాపు పూర్తయ్యింది. త్వరలో టెలికాం టారిఫ్‌లు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న ఓ2సీ బిజినెస్‌తో పాటు ఇకపై టెలికాం నుంచి కూడా రిలయన్స్‌కు భారీ నగదు ప్రవాహం రానుంది. తక్కువ మూలధనం అవసరమయ్యే రిటైల్‌, నూతన ఇంధన రంగాలపై కంపెనీ వచ్చే మూడేళ్లలో దృష్టి సారించే అవకాశం ఉంది’’ అని గోల్డ్‌మన్‌ శాక్స్‌ నివేదిక పేర్కొంది.

2022-23లో రిలయన్స్‌ మూలధన వ్యయం (Reliance Capex) 17.6 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు అంచనా వేసిన నివేదిక.. 2025-26 నాటికి అది క్రమంగా 11.2 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని తెలిపింది. 2024-27 ఆర్థిక సంవత్సరాల మధ్య కంపెనీ రిటైల్‌ వ్యాపార ఎబిట్‌డా రెండింతలవుతుందని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని