JioMart: క్విక్‌ కామర్స్‌లోకి రిలయన్స్‌.. 30 నిమిషాల్లో డెలివరీ?

JioMart: జియోమార్ట్ పేరిట రిలయన్స్‌ ఇప్పటికే నిత్యావసర సరకులను అందిస్తున్న విషయం తెలిసిందే. దీంట్లోనే క్విక్‌ కామర్స్‌ విభాగాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది.

Updated : 31 May 2024 13:42 IST

JioMart | ఇంటర్నెట్‌ డెస్క్‌: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తిరిగి క్విక్‌ కామర్స్‌ విభాగంలోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు రిలయన్స్‌ రిటైల్‌ ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న బ్లింకిట్‌, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, జెప్టో, బీబీనౌ తరహాలో 10 నిమిషాల్లో డెలివరీ మోడల్‌ను రిలయన్స్‌ అనుసరించబోవడం లేదని తెలుస్తోంది.

జియోమార్ట్‌ (JioMart) పేరిట కొవిడ్‌ సమయంలో రిలయన్స్‌ నిత్యావసర సరకుల డెలివరీ విభాగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. అయితే, ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌ తరహాలో ఆర్డర్‌ చేసిన రోజే డెలివరీని మాత్రం హామీ ఇవ్వలేదు. 

రిలయన్స్‌ రిటైల్‌ (Reliance Retail) భిన్నంగా 30 నిమిషాల్లో డెలివరీ చేసే వ్యాపార నమూనాను సిద్ధం చేస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు. సొంత స్టోర్లు, వాటి నుంచి కొనుగోలు చేసే కిరాణా దుకాణాల నుంచి వస్తువులను సేకరించి కస్టమర్లకు అందించే యోచనలో ఉంది. జియోమార్ట్‌ పార్ట్‌నర్‌లో భాగంగా 20 లక్షల కిరాణా దుకాణాలు రిలయన్స్‌ రిటైల్‌ హోల్‌సేల్‌ విభాగం నుంచి కొనుగోళ్లు చేస్తున్నాయి. దీంతో ఇతర క్విక్‌ కామర్స్‌ సంస్థల తరహాలో ప్రతి ఏరియాలో డార్క్‌ స్టోర్లను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉండదు.

ఫైండ్‌ (FYND), లోకస్‌ వంటి టెక్‌ ప్లాట్‌ఫామ్‌ల సేవలు ఉపయోగించి వేగవంతమైన రూట్లలో 30 నిమిషాల్లో డెలివరీ చేయాలని రిలయన్స్‌ ప్లాన్‌ చేసింది. తొలుత నిత్యావసర సరకులతో సేవలను ప్రారంభించే యోచనలో ఉంది. తర్వాత దుస్తులు, ఎలక్ట్రానిక్స్‌కూ విస్తరించనున్నట్లు సమాచారం. రిలయన్స్‌ రిటైల్‌కు ఉన్న 19,000కు పైగా స్టోర్లు అందుకు దోహదం చేయనున్నాయి.

వచ్చే నెలలోనే రిలయన్స్‌ క్విక్‌ కామర్స్‌ సేవలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కంపెనీ ఉన్నతోద్యోగి ఒకరు తెలిపారు. తొలుత దిల్లీ, ముంబయి, బెంగళూరు, చెన్నై, పుణె, హైదరాబాద్‌, కోల్‌కతా నగరాల్లో ఈ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంది. ‘జియోమార్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (JioMart Express)’ పేరిట వీటిని అందించనున్నట్లు తెలుస్తోంది. జియోమార్ట్‌ యాప్‌లోనే ఇది భాగంగా ఉండనుంది. రిలయన్స్‌ 2023లోనే క్విక్‌ కామర్స్‌ను ముంబయిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. కానీ, వివిధ కారణాల వల్ల దాన్ని నిలిపివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని