Retail inflation: మూడు నెలల గరిష్ఠానికి రిటైల్‌ ద్రవ్యోల్బణం

Retail inflation: రిటైల్‌ ద్రవ్యోల్బణం మరోసారి పెరిగింది. ఆర్‌బీఐ లక్ష్యాన్ని దాటుతూ మూడు నెలల గరిష్ఠ స్థాయికి చేరింది.

Published : 13 Feb 2023 23:59 IST

దిల్లీ: తగ్గినట్లే తగ్గిన రిటైల్‌ ద్రవ్యోల్బణం (Retail inflation) మరోసారి పైకెగిసింది. జనవరిలో వినియోగదారుల ధరల సూచీ ఆధారిత (CPI) ద్రవ్యోల్బణం 6.52 శాతానికి చేరింది. ఆర్‌బీఐ నిర్దేశించుకున్న లక్ష్యాన్ని దాటడంతో పాటు మూడు నెలల గరిష్ఠానికి చేరింది. తృణధాన్యాలు, ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే తదితర ఆహార పదార్థాల ధరలు పెరగడమే ఇందుకు కారణం. ఈ మేరకు సంబంధిత గణాంకాలను కేంద్ర గణాంక కార్యాలయం వెల్లడించింది. 

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గరిష్ఠంగా అక్టోబర్‌లో 6.77 శాతంగా నమోదైన రిటైల్‌ ద్రవ్యోల్బణం.. డిసెంబర్‌ నెలలో 5.72 శాతానికి చేరింది. గతేడాది జనవరిలో 6.01 శాతంగా ఉంది. అర్బన్‌ ఏరియాల్లో 6 శాతంగా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం 6.85 శాతంగా నమోదైంది. ఆహార పదార్థాల ద్రవ్యోల్బణం సైతం 4.19 శాతం నుంచి 5.94 శాతానికి పెరిగింది. రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని 2-6 శాతానికి మధ్య ఉంచాలని ఆర్‌బీఐ లక్ష్యంగా నిర్దేశించుకుంది. రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడంతో రేట్ల పెంపులో ఆర్‌బీఐ వేగాన్ని తగ్గించింది. ఇటీవల కేవలం 25 బేసిస్‌ పాయింట్లు మాత్రమే పెంచింది. ద్రవ్యోల్బణం అదుపులోకి రాకపోతే ద్రవ్యపరపతి విధానాన్ని మరింత కఠినతరం చేసే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని