Term deposits: వడ్డీరేట్ల పెంపుతో టర్మ్‌ డిపాజిట్ల వైపు మొగ్గు

Term deposits:  మొత్తం బ్యాంకు డిపాజిట్లలో టర్మ్‌ డిపాజిట్ల వాటా 2023 మార్చిలో ఉన్న 57.2 శాతం నుంచి 2023 డిసెంబర్‌ నాటికి 60.3 శాతానికి పెరిగాయని ఆర్‌బీఐ వెల్లడించింది.

Published : 03 Mar 2024 16:17 IST

దిల్లీ: బ్యాంకుల్లో వడ్డీ రేట్లు పెరిగిన నేపథ్యంలో ఖాతాదారులు టర్మ్‌ సేవింగ్స్‌ ప్లాన్ల వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. మొత్తం బ్యాంకు డిపాజిట్లలో (Bank Deposits) వీటి వాటా 2023 మార్చిలో ఉన్న 57.2 శాతం నుంచి 2023 డిసెంబర్‌ నాటికి 60.3 శాతానికి పెరిగిందని ఆర్‌బీఐ తాజా వివరాలు వెల్లడిస్తున్నాయి.

2023 ఏప్రిల్‌- డిసెంబర్ మధ్య పెరిగిన డిపాజిట్లలో టర్మ్‌ డిపాజిట్ల (Term Deposits) వాటానే 97.6 శాతంగా ఉంది. అదే సమయంలో కరెంట్‌ ఖాతా, సేవింగ్స్‌ ఖాతాల (CASA) డిపాజిట్లు మాత్రం తగ్గాయి. ఏడు శాతం కంటే ఎక్కువ వడ్డీ రేటు కలిగిన టర్మ్ డిపాజిట్ల వాటా 2023 డిసెంబరులో మొత్తం టర్మ్ డిపాజిట్లలో 61.4 శాతానికి చేరింది. మార్చిలో ఇది 33.7 శాతంగా ఉంది. దాదాపు ఏడాది కాలంగా ఆర్‌బీఐ రెపోరేటును 6.5 శాతం వద్ద స్థిరంగా కొనసాగిస్తోంది. చివరిసారి 2023 ఫిబ్రవరిలో 6.25 శాతం నుంచి 6.5 శాతానికి పెంచింది. 2022 నుంచి పలు దఫాల్లో దాదాపు 250 బేసిస్‌ పాయింట్లు పెంచిన విషయం తెలిసిందే.

2023 అక్టోబరు - డిసెంబరు మధ్య పెరిగిన టర్మ్‌ డిపాజిట్లలో (Term Deposits) మూడోవంతు రూ.లక్ష నుంచి రూ.1 కోటి మధ్య ఉన్నవేనని ఆర్‌బీఐ వెల్లడించింది. అంతక్రితం త్రైమాసికంలో ఈ వాటా 46.5 శాతంగా ఉంది. డిపాజిట్లలో మహిళా ఖాతాదారుల వాటా 2023 సెప్టెంబరులో 20.2 శాతంగా ఉండగా.. అది డిసెంబరు నాటికి 20.6 శాతానికి చేరింది. మరోవైపు డిసెంబరు డిపాజిట్లలో సీనియర్‌ సిటిజెన్స్‌ వాటా 20.1 శాతంగా ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని