Ritesh Agarwal: ‘ఎప్పుడూ మా అమ్మ చెప్పే మాట అదే’: జీవిత పాఠం చెప్పిన ఓయో సీఈఓ

ఓయో సీఈఓ రితేశ్ అగర్వాల్‌(Ritesh Agarwal) షేర్ చేసిన వీడియో నెటిజన్లను మెప్పిస్తోంది. అందులో ఆయన ఏం చెప్పారంటే..?

Updated : 22 Apr 2023 13:22 IST

ముంబయి: కెరీర్‌లో ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులు చెప్పే అనుభవ పాఠాలు యువతలో ఎప్పుడూ స్ఫూర్తినింపుతూ ఉంటాయి. ఓయో(OYO) సీఈఓ రితేశ్‌ అగర్వాల్‌(Ritesh Agarwal).. తన అమ్మ చెప్పిన మాటను ఐఐఎం నాగ్‌పుర్ విద్యార్థులతో పంచుకున్నారు. ఐఐఎంలో ఇటీవల రితేశ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ఇంతకీ ఈ సీఈఓ అమ్మ ఏం చెప్పారంటే..?

‘నా అనుభవాలు, నేను నేర్చుకున్న పాఠాలను ఇటీవల ఐఐఎం నాగ్‌పుర్(IIM Nagpur) విద్యార్థులతో పంచుకునే అవకాశం దక్కింది’ అంటూ విద్యార్థులతో మాట్లాడిన వీడియోను రితేశ్‌ షేర్ చేశారు. తన మనసులో నాటుకుపోయిన మాటను వెల్లడించారు. ‘మీరు ఉన్నతస్థానాలకు చేరుకునే క్రమంలో మీ మూలాలను మర్చిపోవద్దు. జీవితంలో ఎంతగా పైకెదిగితే.. అంతగా ఒదిగి ఉండాలనే మాటను మా అమ్మదగ్గర విన్నాను. మీరు జీవితంలో ఎదుగుతున్నప్పుడు.. మీరు ఇప్పుడు ఏం సాధించారు, రెండేళ్ల క్రితం ఎలా ఉండేవారనే విషయాన్ని మర్చిపోకూడదు. మీరు మీ ప్రతిభతో పెద్ద వ్యాపారాలను నిర్మించాలనే సంకల్పాన్ని వీడనట్లే.. మీ మూలాలను కూడా మర్చిపోకూడదు’ అని వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను మెప్పిస్తోంది. ‘మీ మాటలతో అంగీకరిస్తున్నాం, మీ స్టోరీ అందరికీ ఆదర్శం’ అంటూ పోస్టులు పెట్టారు. 

ఒడిశాలోని రాయ్‌గఢ్‌లో జన్మించిన రితేశ్‌ అగర్వాల్‌(Ritesh Agarwal ).. 2013లో ఓయోను స్థాపించి విజయవంతమయ్యారు. తక్కువ కాలంలోనే బిలియనీర్‌గా ఎదిగి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. 2013 మే నెలలో తక్కువ ధరల్లోనే నాణ్యమైన గదులతో కూడిన హోటల్స్‌ వసతి కల్పించే ఓయో రూమ్స్‌ని ప్రారంభించారు. ఆ సమయంలో ఆయన వయస్సు 19ఏళ్లే. 2013లో గుడ్‌గావ్‌లోని ఒక హోటల్‌తో ప్రారంభమైన అనుసంధానం.. ఇప్పుడు 800 నగరాలకు పైగా విస్తరించింది.  ప్రస్తుతం ఆయన ఆస్తుల విలువ 1.1బిలియన్‌ డాలర్లు (రూ.7,253 కోట్లు)కు చేరుకుంది. భారత్‌లోనే కాకుండా మిగతా దేశాలకూ తన వ్యాపారాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని