GST: జీఎస్టీ రికార్డ్‌.. రెండోసారి ₹1.60లక్షల కోట్లు దాటిన వసూళ్లు

మార్చి నెలలో రూ.1,60,122 కోట్ల జీఎస్‌టీ (GST) వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంలో ఈ వసూళ్లు రూ.18.10లక్షల కోట్లుగా ఉన్నట్లు తెలిపింది.

Published : 01 Apr 2023 16:55 IST

దిల్లీ: వస్తు సేవల పన్ను వసూళ్లు (GST revenue )  మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. మార్చి నెలలో రూ.1.60లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ శనివారం వెల్లడించింది. గతేడాది మార్చి నెల వసూళ్లతో పోలిస్తే ఈ వసూళ్లలో 13శాతం వృద్ధి నమోదైంది. కాగా.. జీఎస్‌టీ (GST)ని అమల్లోకి తెచ్చినప్పటి నుంచి ఈ వసూళ్లు రూ.1.60లక్షల కోట్లు దాటడం ఇది రెండోసారి. (GST Collections)

మార్చి (March) నెలలో మొత్తం రూ.1,60,122 కోట్ల జీఎస్టీ వసూలైనట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇందులో సీజీఎస్టీ (CGST) కింద రూ.29,546 కోట్లు, ఎస్‌జీఎస్టీ (SGST) కింద రూ.37,314 కోట్లు, ఐజీఎస్టీ (IGST) కింద రూ.82,907కోట్లు సమకూరినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. ఐజీఎస్టీ కింద ఈ స్థాయిలో వసూలవడం ఇదే తొలిసారి అని పేర్కొంది. ఇక, సెస్సుల (Cess) రూపంలో రూ. 10,355కోట్లు (వస్తువుల దిగుమతి నుంచి వసూలు చేసిన సుంకాలు కలిపి) వసూలైనట్లు పేర్కొంది.

జీఎస్టీ వసూళ్లు (GST revenue) రూ.1.4లక్షల కోట్ల పైనే నమోదవ్వడం వరుసగా ఇది 12వ నెల కావడం విశేషం. మార్చి నెలలో ఈ వసూళ్లు ఏకంగా రూ.1.60లక్షల కోట్లు దాటాయి. ఇప్పటివరకు వసూలైన జీఎస్టీలో ఇది రెండో అత్యధికం. ఏప్రిల్‌ 2022లో అత్యధికంగా రూ.1.68లక్షల కోట్ల జీఎస్టీ వసూలు కావడం ఆల్‌టైం రికార్డుగా ఉంది.

ఏడాదిలో రూ.18.10లక్షల కోట్లు..

2022-23 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.18.10లక్షల కోట్ల జీఎస్టీ వసూలైంది. అంటే సగటున నెలకు రూ.1.51లక్షల కోట్లు వసూలయ్యాయి. అంతక్రితం ఆర్థిక సంవత్సరం (2021-22)తో పోలిస్తే ఈ వసూళ్లు 22శాతం ఎక్కువ అని ఆర్థికశాఖ వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని