Sam Bankman Fried: ఒకప్పటి క్రిప్టో కింగ్‌ శామ్‌ బ్యాంక్‌మన్‌కు 25 ఏళ్ల జైలు శిక్ష

Sam Bankman Fried: క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ ఎఫ్‌టీఎక్స్‌ సహ వ్యవస్థాపకుడు శామ్‌ బ్యాంక్‌మన్‌ ఆర్థిక మోసాలు, అక్రమ నగదు చలామణి వంటి నేరాలకు పాల్పడ్డట్లు నవంబరులో తేల్చిన న్యూయార్క్‌ కోర్టు తాజాగా ఆయనకు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది.

Published : 29 Mar 2024 08:38 IST

న్యూయార్క్‌: దివాలా తీసిన క్రిప్టో ఎక్స్ఛేంజ్‌ ఎఫ్‌టీఎక్స్‌ సహ వ్యవస్థాపకుడు శామ్‌ బ్యాంక్‌మన్‌ ఫ్రీడ్‌కు (Sam Bankman Fried) న్యూయార్క్‌ కోర్టు 25 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అమెరికా కాలమానం ప్రకారం గురువారం తీర్పు వెలువరించింది. శిక్ష ఖరారుకు ముందు బ్యాంక్‌మన్‌ వ్యవహార శైలిపై న్యాయమూర్తి లెవిస్‌ కప్లన్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. విచారణ సమయంలో ఆయన అన్నీ అబద్ధాలు చెప్పారన్నారు. కస్టమర్ల డబ్బు ఇతర మార్గాల్లోకి వెళ్తున్నట్లు తనకు తెలియదని చెప్పడం పూర్తిగా అవాస్తవమన్నారు.

తప్పులు జరుగుతున్నట్లు బ్యాంక్‌మన్‌కు (Sam Bankman Fried) ముందే తెలుసని న్యాయమూర్తి తేల్చారు. కస్టమర్లను మోసం చేశాననే బాధ ఉన్నప్పటికీ.. విచారణలో మాత్రం దాన్ని ఆయన అంగీకరించలేదన్నారు. బ్యాంక్‌మన్‌ తరఫున న్యాయవాదులు వాదిస్తూ.. శిక్షను 5 - 6.5 ఏళ్లకు పరిమితం చేయాలని కోర్టును అభ్యర్థించారు. ఎలాంటి హింసాత్మక చర్యలకు పాల్పడలేదని, ఇది అతడి జీవితంలో తొలి నేరమని పేర్కొన్నారు. మానసికంగానూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పైగా సంస్థ దివాలా పరిష్కార ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో కస్టమర్లు తాము కోల్పోయిన సొమ్ములో మెజారిటీ భాగాన్ని పొందే అవకాశం ఉందని చెప్పారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని తక్కువ తీవ్రత గల శిక్షను ఖరారు చేయాలని న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ప్రభుత్వం తరఫు న్యాయవాదులు మాత్రం చట్టప్రకారం బ్యాంక్‌మన్‌కు దాదాపు 100 ఏళ్ల శిక్ష పడాల్సి ఉందని తెలిపారు. కానీ, దాన్ని 40 ఏళ్లకు పరిమితం చేయాలని కోరారు. చివరకు న్యాయమూర్తి కల్పన్‌ 25 ఏళ్ల జైలు శిక్షను ఖరారు చేశారు. ఇది దీర్ఘకాల శిక్షగా అనిపిస్తున్నప్పటికీ.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం విధించాల్సిన దానితో పోలిస్తే చాలా తక్కువని తెలిపారు. ఈమాత్రం కూడా శిక్ష పడకపోతే.. భవిష్యత్తులో మళ్లీ తీవ్ర నేరాలకు పాల్పడే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. తీర్పునకు ముందు బ్యాంక్‌మన్‌ కోర్టులో తీవ్ర పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ‘‘నా వల్ల చాలా మంది నిరాశ చెందారు. దానికి క్షమాపణలు చెబుతున్నా. జరిగిన దానికి చింతిస్తున్నా’’ అని నెమ్మదిగా మాట్లాడుతూ అన్నారు.

ఎవరీ బ్యాంక్‌మన్‌?

2017లో వాల్‌ స్ట్రీట్‌లో ఉద్యోగం వదిలేసిన బ్యాంక్‌మన్‌.. అలమెడా రీసెర్చ్‌ పేరిట హెడ్జ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. రెండేళ్ల తర్వాత ఎఫ్‌టీఎక్స్‌ పేరుతో క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌ను నెలకొల్పారు. క్రిప్టో ర్యాలీతో ఫోర్బ్స్‌ గణాంకాల ప్రకారం ఆయన సంపద 26 బిలియన్‌ డాలర్లకు చేరింది. అప్పటికి ఆయన వయసు 30 ఏళ్లు కూడా నిండలేదు. ఆ సంపదతో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థులకు భారీ ఎత్తున విరాళాలు ఇచ్చారు. 2022 అమెరికా మధ్యంతర ఎన్నికల సమయంలో పార్టీ కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందజేశారు. బహమాస్‌ కేంద్రంగా కార్యకలాపాలను నిర్వహించిన బ్యాంక్‌మన్‌.. తనదైన ఆహార్యంతో అప్పట్లో అందరి దృష్టినీ ఆకర్షించారు. బిల్‌ క్లింటన్‌ వంటి హేమాహేమీలతోనూ ఆయన షార్ట్స్‌ ధరించి సమావేశమయ్యేవారు. క్రిప్టో సురక్షితమైన పెట్టుబడని చెప్పడం కోసం పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు ఇచ్చారు. అందుకోసం హాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలను రంగంలోకి దింపారు.

ఇదీ జరిగిందీ..

అసలు వివాదం ఎఫ్‌టీఎక్స్‌, అలమెడా రీసెర్చ్‌ మధ్య సంబంధంతోనే మొదలైంది. వాస్తవానికి ఈ రెండు కంపెనీలు వేర్వేరని బ్యాంక్‌మన్‌ (Sam Bankman Fried) చెప్పేవారు. కానీ, అది వాస్తవం కాదని తర్వాత తేలింది. అలమెడా ఆస్తుల్లో చాలా వరకు ఎఫ్‌టీఎక్స్‌ ఆవిష్కరించిన ఎఫ్‌టీటీ క్రిప్టో టోకెన్ల రూపంలోనే ఉన్నట్లు తెలిపింది. మార్కెట్‌ విలువ ప్రకారం తమ ఎఫ్‌టీటీ టోకెన్ల విలువ బిలియన్‌ డాలర్లుగా ఉన్నట్లు అప్పట్లో అలమెడా లెక్కగట్టింది. వాస్తవానికి టోకెన్లన్నీ ఈ ఇరు సంస్థల అధీనంలోనే ఉన్నాయి. అసలు సర్క్యులేషన్‌లో ఉన్నవి చాలా తక్కువ. అంటే అలమెడా విలువ పూర్తిగా ఊహాజనితమే.

ఈ విషయం బయటకు రాగానే ఎఫ్‌టీఎక్స్‌ ప్రత్యర్థి సంస్థ బైనాన్స్‌ వ్యూహాత్మకంగా వ్యవహరించి తమ వద్ద ఉన్న ఎఫ్‌టీటీ టోకెన్లను అన్నింటినీ విక్రయించేసింది. దీంతో మిగతా ట్రేడర్లు సైతం తమ ఎఫ్‌టీటీ హోల్డింగ్స్‌ను వదిలించుకునేందుకు ఎగబడ్డారు. ఫలితంగా ఎఫ్‌టీటీ విలువ 75 శాతానికి పైగా పడిపోయింది. అలమెడా ఆస్తుల విలువ పూర్తిగా ఆవిరైంది. మరోవైపు ఎఫ్‌టీఎక్స్‌ నుంచి నిధులను ఉపసంహరించుకునేందుకు మదుపర్లు ఎగబడ్డారు. కానీ, కస్టమర్లు, ఇన్వెస్టర్ల ఫండ్లను అప్పటికే ఎఫ్‌టీఎక్స్‌ అక్రమంగా అలమెడా లోన్ల కోసం తనఖా కిందకు తరలించింది. తద్వారా అలమెడా నష్టాలను పూడ్చేందుకు ప్రయత్నించారు. అలాగే రాజకీయ విరాళాలు, బహమాస్‌లో విలాసవంతమైన లైఫ్‌స్టైల్‌ కోసం వినియోగించారు. కానీ, మదుపర్లు ఒక్కసారిగా విత్‌డ్రాలకు ఎగబడడంతో ఎఫ్‌టీఎక్స్‌ వద్ద మదుపర్లకు చెల్లించేందుకు నిధులు లేవు. మరోవైపు అలమెడా దగ్గర ఉన్న టోకెన్లకు విలువ లేకుండా పోయింది. ఫలితంగా ఎఫ్‌టీఎక్స్‌ దివాలా పరిష్కార ప్రణాళికకు దరఖాస్తు చేసుకుంది. ఈ వ్యవహారంలో బ్యాంక్‌మన్‌తో పాటు మరో ముగ్గురూ ఉన్నారు. వారంతా తప్పులను కోర్టు ముందు అంగీకరించారు. బ్యాంక్‌మన్‌ ఆదేశాల మేరకే తాము నడుచుకున్నట్లు తెలిపారు. కస్టమర్లను మోసం చేయడం, అక్రమ నగదు చలామణి సహా మొత్తం ఏడు అభియోగాల్లో బ్యాంక్‌మన్‌ను గత నవంబరులో కోర్టు దోషిగా తేల్చింది. దాదాపు 10 బిలియన్‌ డాలర్ల విలువైన ఆర్థిక నేరం జరిగినట్లు గుర్తించింది. ఇది అమెరికా చరిత్రలోనే అతిపెద్ద ఆర్థిక మోసాల్లో ఒకటని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని