SBI: లోన్‌ వాయిదా ఎగ్గొట్టబోయేవారికి చాక్లెట్‌.. ఎస్‌బీఐ వినూత్న కార్యక్రమం!

SBI: రుణాల వసూలును మెరుగుపర్చేందుకు ఎస్‌బీఐ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. లోన్‌ ఎగ్గొట్టే అవకాశం ఉన్నవారికి చాక్లెట్లు పంపి మరీ గుర్తుచేయాలని నిర్ణయించింది.

Published : 17 Sep 2023 16:15 IST

ముంబయి: లోన్‌ తీసుకున్నవారు సకాలంలో వాయిదాలు చెల్లించేలా బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ (SBI) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు సిద్ధమైంది. నెలవారీ వాయిదాలు (EMI) ఎగ్గొట్టే అవకాశం ఉన్నవారికి చాక్లెట్లు పంపాలని నిర్ణయించింది. తద్వారా వారికి వాయిదా కట్టాలని గుర్తు చేయాలనుకుంటున్నట్లు తెలియజేసింది.

వాయిదా ఎగ్గొట్టాలని ప్లాన్ చేస్తున్న రుణగ్రహీత బ్యాంక్ నుంచి వచ్చే రిమైండర్ కాల్‌కు సమాధానం ఇవ్వడం లేదని గుర్తించినట్లు ఎస్‌బీఐ (SBI) తెలిపింది. కాబట్టి అలాంటి వారి ఇంటికి ముందస్తు సమాచారం లేకుండా వెళ్లి చాక్లెట్లు ఇచ్చి వాయిదా కట్టాలని గుర్తుచేయాలనుకుంటున్నట్లు తెలిపింది. రిటైల్‌ రుణాలు, వాటిపై వడ్డీరేట్లు పెరుగుతున్న నేపథ్యంలో వసూళ్లను మెరుగుపర్చే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ఇప్పటికే రెండు ఫిన్‌టెక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకొని ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు ఎస్‌బీఐ (SBI) తెలిపింది. ఈ సంస్థలు కృత్రిమ మేధ (Artificial Intelligence- AI)ను ఉపయోగించి తమ రుణగ్రహీతలకు వాయిదా సమీపిస్తున్న సమయంలో రిమైండర్‌లు పంపుతాయని తెలిపింది. వాయిదా ఎగ్గొట్టే అవకాశం ఉన్నవారిని గుర్తించి ఆ సమాచారాన్ని ఒక ఫిన్‌టెక్‌ తమకు తెలియజేస్తుందని తెలిపింది. అలాగే సంస్థ ప్రతినిధులు కొంతమంది రుణగ్రహీతల ఇంటికి చాక్లెట్‌తో వెళ్లి గుర్తుచేస్తారని వివరించింది. ఈ కార్యక్రమాన్ని 15 రోజుల క్రితం నుంచే అమలు చేస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకు ప్రోగ్రాం సక్సెస్‌ అయినట్లు వెల్లడించింది. మరికొన్ని ఫిన్‌టెక్‌లతోనూ చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇది విజయవంతమైతే.. అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపింది. అయితే, మరో నాలుగు నుంచి ఐదు నెలల పాటు దీన్ని పైలట్‌ కార్యక్రమంగానే అమలు చేస్తామని వెల్లడించింది.

SBI రిటైల్ లోన్ బుక్ 2023 జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.10.34 లక్షల కోట్ల నుంచి 16.46 శాతం పెరిగి రూ.12.04 లక్షల కోట్లకు చేరుకుంది. బ్యాంక్‌ మొత్తం లోన్‌ బుక్‌లో అధిక వాటా రిటైల్‌ రుణాలదేనని బ్యాంక్‌ తెలిపింది. బ్యాంక్‌ రిటైల్‌ రుణాల్లో ఏటా రెండంకెల శాతం వృద్ధి నమోదవుతున్నట్లు వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు